Kiran Kumar Reddy : బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి.. కర్ణాటక ఎన్నికల బాధ్యతలు కూడా..?
- IndiaGlitz, [Saturday,April 08 2023]
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కమలనాథులు కీలక బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న బీజేపీలో చేరిన నాటి నుంచి ఆ పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అవుతున్నారు కిరణ్. అలాగే బీఎల్ సంతోష్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను కూడా కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన కిరణ్‌కు ఎలాంటి పదవి అప్పగిస్తారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ జాతీయ కార్యదర్శి పదవీతో పాటు కర్ణాటక ఎన్నికల బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
కర్ణాటకలో నిర్ణయాత్మక శక్తిగా తెలుగువారు :
కర్ణాటకలో తెలుగువారి ప్రాబల్యం అధికం. గతంలోని హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంతో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. బళ్లారి, రాయచూర్, సింధనూరు, గంగావతి, దావణగిరె, గుల్బార్గ, బీదర్, హుబ్లీ, ధార్వాడ్, చిత్రావతి, తుమకూరు, మైసూర్‌లలో తెలుగు జనాభా అధికం. ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లక్షలాది మంది తెలుగువారు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో వీరు అనేక నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా వున్నారు. ఈ క్రమంలోనే తెలుగువారిని ఆకట్టుకునేందుకు కిరణ్‌ను రంగంలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు. సీఎంగా తన పాలనాకాలంలో సమర్ధంగా వ్యవహరించారు కిరణ్ కుమార్ రెడ్డి. అలాగే రాష్ట్ర విభజనను చివరి వరకు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆయనపట్ల సీమాంధ్ర ప్రాంతంలో కొంత పాజిటివ్ వుంది. అలాగే సుదీర్ఘ కాలం రాజకీయాల్లో వుండటంతో పాటు రెడ్డి సామాజిక వర్గంలోనూ కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరే వుంది. ఈ క్రమంలోనే ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు కాషాయ నేతలు.
కాగా.. గత నెల 12న కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖను పంపారు. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు అదే నిజమైంది.
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలోకి :
ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు వ్యతిరేకించి సొంతపార్టీపైనే పోరాటం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఆయన ప్రయత్నం వృథా ప్రయాసే అయ్యింది. చివరికి తెలుగు నేల రెండు ముక్కలు కావడంతో సీఎం, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఆయన.. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటికీ మౌనంగానే వుంటున్నారు.
తండ్రి మరణంతో రాజకీయాల్లోకి :
తన తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ బడిలోనే ఓనమాలు దిద్దారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్మంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి .. 2014 ఫిబ్రవరి 19 వరకు పనిచేశారు.