Somu Veerraju:మీ టర్మ్ అయిపోయింది తప్పుకోండి.. సోము వీర్రాజుకు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్

  • IndiaGlitz, [Tuesday,July 04 2023]

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం బాధ్యతల నుంచి తప్పించింది. వీర్రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి పదవికి రాజీనామా చేయమన్నారని తెలిపారు. తన పదవీకాలం పూర్తయినందునే తనను తప్పించాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. అయితే ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సత్యకుమార్‌ను నియమించనున్నట్లు సమాచారం. వీర్రాజుకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశాలు వున్నాయి.

అటు తెలంగాణ బీజేపీ కార్యవర్గంలోనూ కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం చర్చించినట్లుగా తెలుస్తోంది. నిజానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాకే తెలంగాణ బీజేపీకి జోష్ వచ్చింది. ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారు. అయితే దూకుడు స్వభావంతో పాటు అందరినీ కలుపుకుని వెళ్లడం లేదంటూ కొందరు సంజయ్‌పై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంజయ్‌ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని కమలనాథులు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ మూలాలు, ఆశీస్సులున్న సంజయ్‌‌ని మార్చడం అంత తేలికకాదనే వాదనలు వినిపిస్తున్నాయి.