BJP:తెలంగాణ ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేస్తే బీజేపీకి ప్లస్సా.. మైనస్సా..?
- IndiaGlitz, [Wednesday,October 18 2023]
తెలంగాణ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పోలింగ్‌కు 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారంలు అందించి ముందంజడలో ఉండగా.. కాంగ్రెస్ కూడా 55 మందితో తొలి జాబితా ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో వెనకబడింది. రేపో మాపో అభ్యర్థుల తొలి జాబితాను కమలం పెద్దలు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కనీసం 30 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినట్లుగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్ కల్యాణ్‌ను కోరారు. అయితే పవన్ మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారని.. కనీసం 30 స్థానాల్లోనైనా పోటీ చేయకపోతే వారి స్థైర్యం దెబ్బ తింటుందన్నారు. మద్దతుపై నిర్ణయం తెలిపేందుకు తనకు రెండు మూడు రోజులు సమయం కావాలని కిషన్ రెడ్డికి తెలిపారు. దీంతో బీజేపీ-జనసేన పొత్తుపై ఆసక్తి నెలకొంది.
అధ్యక్షుడిగా బండి మార్పుతో క్యాడర్‌తో తీవ్ర అసహనం..
ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే కమలం పార్టీకి లాభమా కన్నా నష్టమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి కిషన్ రెడ్డికి అప్పగించడంతో పార్టీలోని మెజార్టీ నేతలతో పాటు బీజేపీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రేటర్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటడంతో ఇక బీఆర్ఎస్ను ధీటుగా ఢీకొని అధికారంలోకి రావడం ఖాయమని సామాన్య బీజేపీ కార్యకర్తలు భావించారు.
పొత్తులో జనసేనకు 30 సీట్లు ఇవ్వాలి..
అయితే ఉన్నట్లుంది ఫైర్ బ్రాండ్ లాంటి బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా మార్చడం మెతక వైఖరి ఉండే కిషన్ రెడ్డికి పగ్గాలు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది. దీంతో అప్పటి వరకు ఫుల్ జోష్‌లో నెలకొన్ని బీజేపీ దారుణంగా వెనకబడిపోయింది. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోవడంతో ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా పడింది. అప్పటి నుంచి బీజేపీ గ్రాఫ్ జీరోకు వెళ్లిపోయింది. అసలే తీవ్ర అసంతృప్తితో ఉన్న కమలం కార్యకర్తలకు ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లు జనసేనతో కలిస్తే మరింత అసహనానికి గురయ్యే అవకాశాలున్నాయి అంటున్నారు. ఎందుకంటే కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయాలని అనుకుంటున్నామని జనసేనాని స్పష్టం చేశారు.
పొత్తు పెట్టుకుంటే ఒకటి రెండు సీట్లు రావడం కూడా కష్టమే..
పొత్తు పెట్టుకుంటే జనసేనకు 30 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీటు ఆశిస్తున్న బీజేపీ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఆ ప్రభావం పార్టీ ఓట్లపై పడే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన కొన్ని సంస్థల సర్వేల్లోనూ బీజేపీ 5 సీట్లు కంటే ఎక్కువ రావని తేలింది. సింగిల్‌గా పోటీ చేస్తేనే 5 స్థానాల కంటే ఎక్కువ రావని సర్వేలు చెబుతుంటే.. ఇక రాష్ట్రంలో అంతగా క్యాడర్ లేని జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఒకటి రెండు సీట్లు రావడం కూడా కష్టమేనని వాదనలు వినిపిస్తున్నాయి. జనసేనతోనే కాకుండా తెలుగుదేశం పార్టీతోనూ పొత్తుకు బీజేపీ పెద్దలు తహతహలాడుతున్నారు.
టీడీపీ-జనసేనతో కలిసి వెళ్తే 20 స్థానాలు గెలుచుకోవొచ్చు..
టీడీపీ-జనసేనతో కలిసి పోటీ చేస్తే కనీసం 20 స్థానాలు గెలుచుకోవచ్చన్న అభిప్రాయంతో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో హంగ్ ఏర్పడితే తప్ప కాంగ్రెస్‌ను నిలువరించలేమన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా సొంతంగా పోటీ చేస్తే పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉండబోదని పెద్దలుకు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే తెలుగుదేశం-జనసేనతో పొత్తు ప్రతిపాదన చేస్తున్నట్టు చెబుతున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని.. అప్పుడు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవొచ్చనే ఆలోచనలో కాషాయం నేతలు ఉన్నారట.
చంద్రబాబు అరెస్ట్ వెనక మోదీ-షా ప్రమేయం ఉందనే అభిప్రాయం..
ఇంతవరకు కమలం పెద్దలు ప్లాన్ బాగానే ఉన్నా.. సెటిలర్లు మాత్రం చంద్రబాబు అరెస్ట్ వెనక మోదీ-షా ప్రమేయం ఉందని బలంగా నమ్ముతున్నారు. అలాగే ఏపీలో జగన్‌కు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం, చంద్రబాబు ప్రస్తుత దుస్థితికి బీజేపీనే కారణమనే అభిప్రాయంలో ఉన్నారు. దీంతో బీజేపీతో కలవొద్దని టీడీపీ మద్దతుదారుల నుంచి చంద్రబాబుకు ప్రతిపాదనలు వెళ్లాయట. చంద్రబాబు కూడా తనకు జైలు దుస్థితి రావడానికి కారణం బీజేపీ అనే భావనలో కూడా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. కానీ బీజేపీ మాత్రం చంద్రబాబును లొంగదీసుకుని పొత్తుకు ఒప్పించాలని భావిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. మరి చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే తప్ప పొత్తుపై క్లారిటీ రాదు.
ప్రస్తుత దుస్థితికి బీజేపీ పెద్దల నియంత వైఖరే కారణం..
బీజేపీ-జనసేనతో కలిసి వెళ్లినా.. జనసేన-టీడీపీతో ఉమ్మడిగా పోటీ చేసినా.. సింగిల్‌గా పోటీ చేసినా కాషాయం గుర్తుకు ఓట్లు రావని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు బీజేపీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందనే అభిప్రాయం బలంగా వెళ్లింది. దీంతో ఏపీలోని పరిణామాలు తెలంగాణ బీజేపీపైనా ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బీజేపీ పెద్దల నియంత వైఖరి ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేసిందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతే ఇక ఆ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల ద్వారాలు మూసివేసినట్లే. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లోనే రాజకీయాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు కావాల్సిన ఏ ఒక్క అవకాశాన్ని ఆ పార్టీ అధిష్టానం వదులుకోవడం లేదు.