Modi and Amit Shah:తెలంగాణలో బీజేపీ దూకుడు.. మోదీ, అమిత్ షా రాష్ట్రంలోనే మకాం..

  • IndiaGlitz, [Friday,November 24 2023]

తెలంగాణ ఎన్నికలు చివరి దశకు చేరడంతో బీజేపీ అగ్రనేతలు ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కీలక నేతలంతా తెలంగాణ బాట పట్టనున్నారు. చివరి నాలుగు రోజులు వరుసగా వీరి పర్యటనలు ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. ప్రధాని మోదీ శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో షా పాల్గొంటారు.

రేపు(శనివారం)ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడులో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు పటాన్‌చెరు సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌షోకు హాజరవుతారు.

ఆదివారం ఉదయం మక్తల్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1 గంటకు ములుగు.. 3 గంటలకు భువనగిరి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇలా వరుసగా మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు.

ఇక ప్రధాని మోదీ కూడా శనివారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.

ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 1.25 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటలకు కామారెడ్డి సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని అక్కడే బస చేస్తారు.

26న హైదరాబాద్ శివారులోని కొత్తూరు మండలం చేగూరులోని కన్హా శాంతి వనాన్ని మోదీ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు తూఫ్రాన్ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.

27వ తేదీ ఉదయం 10.30గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్‌ చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం సోమవార రాత్రి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.