BRS:బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్‌కు చావో రేవో పరిస్థితి..

  • IndiaGlitz, [Saturday,April 27 2024]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని 2001, ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం తన పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారు. పార్టీ పెట్టినప్పుడు కనీసం 10 మంది కూడా కేసీఆర్ వెంట లేరు. కానీ మొక్కవోని దీక్షతో ఆయన ముందుకు సాగారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఈ క్రమంలోనే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని చెప్పుకోదగ్గ స్థానాలు గెలిచారు. అనంతరం కేసీఆర్ కేంద్ర సహాయమంత్రిగా కూడా పనిచేశారు. ఈటల రాజేందర్, హరీష్ రావు వంటి నాయకులు వైఎస్ కేబినెట్‌లో స్థానం కూడా దక్కించుకున్నారు.

2009లో పార్టీ ఉనికికే ప్రమాదం..

కానీ తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా కొట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకొచ్చారు. అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనుకున్నారు. పార్టీ నేతలంతా వరుస కట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే వైఎస్సార్ మరణానంతరం ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రకటన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దీక్ష తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. దీంతో 2009 డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటన చేసింది.

తొమ్మిదిన్నరేళ్లు పాటు ముఖ్యమంత్రిగా..

ఆ తర్వాత కూడా రాజీలేని పోరాటంతో ఎట్టకేలకు 2014లో పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్రం బిల్లు పాసై ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావించింది. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అలా 2018లోనూ తిరిగి అధికారంలోకి వచ్చి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తొమ్మిదిన్నరేళ్లు పాటు తెలంగాణను ఏకఛత్రాదిపత్యంతో పాలించిన కేసీఆర్‌కు 2023 ఎన్నికల్లో ప్రజలు చెక్ పెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది కీలక నేతలు పార్టీని వీడిపోతున్నారు.

2009 నాటి గడ్డు పరిస్థితులు రిపీట్..

ఈ పరిణామాలతో ఇప్పుడు మళ్లీ 2009లో లాగా పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులే ప్రధాన బలం. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రమంగా ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ తగ్గడం, ఉద్యమకారులను దూరం పెట్టడం.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చడంతో అసలు సమస్య ప్రారంభమైంది. దీంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అసలే అధికారం పోయిన షాక్‌లో ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. దీంతో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ..

ఎందుకంటే గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా రాష్ట్రంలో బలంగా పుంజుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. బీజేపీ కూడా అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్‌గా చేసుకుంది. దీంతో కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరు అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి తయారైంది. సాధారణంగా లోక్‌సభ ఎన్నికలు అంటే జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి. అంతేకాకుండా గతంలో కంటే బీజేపీ ఈసారి 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన తన ఓటు బ్యాంక్ బలంగా పెంచుకుంది. దీనికి తోడు ప్రధాని మోదీ వేవ్ ఎలాగో ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలో ఉండటం అడ్వాంటేజ్‌గా మారింది. దీంతో ఈ రెండు పార్టీలను ఎదుర్కోవడం బీఆర్ఎస్‌కి సవాల్‌గా మారింది.

కేసీఆర్‌ను చుట్టుముట్టిన సమస్యలు..

అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్.. ఇప్పుడు అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా జైల్లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం చుట్టుముడుతోంది. ఇక నమ్మకస్తులైనా కీలక నేతలంతా కష్టసమయంలో పార్టీని వీడిపోతున్నారు. ఇదిలాఉంటే ఫాంహౌస్‌లో జారిపడి తుంటి ఎముక ఆపరేషన్ జరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు. అయినా పార్టీ ఉనికి కోసం బస్సు యాత్ర చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి 8-12 ఎంపీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితి..

కేసీఆర్ చెప్పినట్లుగా కాకపోయినా కనీసం 5 ఎంపీ సీట్లు గెలిస్తేనే పార్టీ క్యాడర్‌లో తిరిగి జోష్ వస్తుంది. అలా కాకుండా కేవలం ఒకటో రెండో సీట్లకు పరిమితమైతే మాత్రం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగా మారుతుంది. దీంతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఉద్యమ పార్టీగా ఎన్నో పోరాటాలు, సవాళ్లు ఎదుర్కొన్నా కేసీఆర్.. ఈ ఆవిర్భావం దినోత్సం రోజున మళ్లీ మొదటి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి తన రాజకీయ చాణక్యంతో పార్టీని తిరిగి నిలబెడతారో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ తర్వాత తెలియనుంది.

More News

YCP Manifesto:వైసీపీ మేనిఫెస్టో విడుదల.. అమ్మఒడి పెంపు..

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదలచేశారు.

Pensions in AP: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

ఏపీ ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు.

మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడు.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

హైదరాబాద్ శివారు షాద్‌నగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది కార్మికుల ప్రాణాలు కాపాడింది. దీంతో ఆ బాలుడి సాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు.

Telugu Indian Idol:అమెరికాలో తొలిసారిగా ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్' ఆడిషన్స్

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’.

Sarathi Studio: సారథి స్టూడియోస్‌లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలు ప్రారంభం

హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్‌గా ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథి స్టూడియోస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.