బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ విజేత బిందు మాధవి.. కప్ కొట్టిన తొలి మహిళగా చరిత్ర

సోషల్ మీడియాలో వచ్చిన లీకులే నిజమయ్యాయి. బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌ విజేతగా సినీనటి బిందు మాధవి నిలిచారు. తద్వారా బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారి టైటిల్ నెగ్గిన మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు. చివరి వరకు బిందు మాధవితో పోటీపడిన అఖిల్ సార్ధక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఈ పోటీలో బిందు మాధవి, అఖిల్ సార్థక్‌, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మలు టాప్‌ ఫైవ్‌లో ఉండగా.. బిందు మాధవి గ్రాండ్ ఫినాలేలో ఎఫ్3 దర్శకుడు అనిల్‌ రావిపూడి, నటుడు సునీల్‌ డబ్బుతో వున్న సూట్‌కేసును తీసుకొచ్చారు. దీంతో డబ్బులు తీసుకునేందుకు అరియానా, శివ ముందుకు వచ్చారు. తనకు ఇల్లు కొనక్కుకోవడానికి డబ్బులు అవసరం అంటూ అరియానా రూ.10 లక్షలు ఉన్న సూట్‌ కేసును అందుకుని పోటీ నుంచి తనకు తానుగా నిష్క్రమించారు.

తర్వాత ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా యాంకర్ శివ బయటకు వెళ్లాడు. అనంతరం గోల్డెన్‌ బాక్స్‌తో హౌస్‌లోకి వెళ్లిన నాగార్జున టాప్‌ 2 కంటెస్టెంట్స్‌ అయిన అఖిల్‌, బిందు మాధవిల అనుభవాల గురించి అడిగారు. తర్వాత వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చిన కింగ్... బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాడు. దీంతో ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కాగా... బిగ్‌బాస్‌ టైటిల్ కొట్టాలన్న అఖిల్‌ ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి.

బిగ్‌బాస్ టీవీ షోలల్లో అల‌రించిన ప‌లువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజ‌న్‌లోనూ సందడి చేశారు. అప్పటికే బుల్లితెరపై చేసిన అనుభవం వుండటంతో వీరంద‌రి నుంచి బిందు మాధ‌వికి తొలి నుంచి గ‌ట్టి పొటీనే ఎదురైంది. అయినప్పటికీ వారంద‌రినీ వెన‌క్కు నెట్టేసిన బిందు మాధ‌వి తెలుగు బిగ్‌బాస్ వెర్ష‌న్‌లో తొలి లేడీ విన్న‌ర్‌గా గెలిచింది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఆమె ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో టైటిల్ రేసు సందర్భంగా అఖిల్‌కు తెలుగు ప్రేక్ష‌కుల నుంచే మ‌ద్ద‌తు రాగా... బిందు మాధ‌వికి మాత్రం తెలుగుతో పాటు త‌మిళం నుంచి కూడా ఓట్లు పడ్డాయి. దీంతో అఖిల్‌ను వెన‌క్కు నెట్టిన బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింద‌న్న చర్చ జరుగుతోంది.

ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్‌ రియాల్టీ షోకు శనివారం (మే 20) శుభం కార్డు పలికారు. ఈ షోలో పాల్గోన్న కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. అజయ్, ఆర్జే చైతూ, అనిల్ రాథోడ్ , మిత్రా శర్మా, యాంకర్ శివలు బాగా హైలైట్ అయ్యారు. అయితే ఈ నాన్ స్టాప్ నుంచి కొంతమందిని బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు తీసుకోబోతున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు 6 జూలై 31వ తేది లేదా ఆగష్టు 7న మొదలు కానుందని టాక్.