స్మార్ట్‌గా కడిగిపారేసిన నాగ్.. కట్టప్ప ఎవరో చెప్పేశారు..

  • IndiaGlitz, [Sunday,September 13 2020]

‘బాహుబలి’ టైటిల్ సాంగ్‌తో కింగ్ నాగార్జున ఎంట్రీ షోకే హైలైట్. బిగ్‌బాస్ షోలో కట్టప్ప ఎవరో తేల్చేద్దామంటూ ఆదిలోనే అదరగొట్టేశారు. షోలో ప్రతి ఒక్కరి చాలా స్మార్ట్‌గా కడిగి పారేశారు. ప్రేక్షకుల మనసులో కంటెస్టెంట్లపై ఉన్న అభిప్రాయాలన్నింటినీ ప్రస్తావించడం అద్భుతంగా అనిపించింది. శుక్రవారం ఏం జరిగిందో చూసిన అనంతరం నాగ్ కంటెస్టెంట్ల ముందుకు వచ్చారు. కంటెస్టెంట్లను హుషారుగా పలకరించిన నాగ్‌కి గంగవ్వ పాట పాడి.. కథ చెప్పడం ఆసక్తికరం అనిపించింది. కథలో ఒక క్యారెక్టర్‌ను నాగ్ సూర్యకిరణ్‌కు ఇచ్చారు.

గంగవ్వ మాట సరిగా అర్థం కావడం లేదని.. కొంచెం స్లోగా మాట్లాడాలని ఆమెకు నాగ్ సూచించారు. ఇక కడగడం.. నోయెల్‌తో నాగ్ స్టార్ట్ చేశారు. నీకు బాగా ఓవర్ థింకింగ్ ఎక్కువ అని చెప్పి అదరగొట్టేశారు. నోయెల్ పాడు చేసిన అంశాలన్నీ ప్రస్తావించి నాగ్ రాక్ చేసేశారు. ఓవర్ థింకింగ్‌తో నిన్ను నువ్వు చెడ గొట్టుకొంటూ అందరినీ చెడగొట్టావని చెప్పారు. ఓవర్ థింకింగ్ తగ్గించుకుంటే సూపర్ అని నోయెల్‌కు సజెషన్ ఇచ్చారు.

నెక్ట్స్ అరియానా విషయానికి వచ్చారు. తనకు అన్నం తినిపించమనడం గురించి నాగ్ ప్రశ్నించారు. ఇంత అబ్బాయిల్లో ఎవరు తినిపిస్తే బాగనిపించింది? అని నాగ్ ప్రశ్నించగా.. అరియానా అఖిల్ పేరు చెప్పింది. అఖిల్.. గంగవ్వను చూసుకునే పద్ధతి బాగుందని కితాబిచ్చారు. అఖిల్‌కు చెమటలు పడితే మొనాల్ తుడవడం గురించి కూడా చెప్పారు. మొనాల్‌ ఎమోషన్ గురించి ప్రశ్నించారు. వడ్డించేటపుడు కోపంతో వడ్డించకూడదని సూచించారు. బిగ్‌బాస్ అయ్యే లోపు తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.

సుజాత గురించి పాజిటివ్‌గానే నాగ్ చెప్పారు. లాస్య గురించి మాట్లాడుతూ.. గోడ మీద పిల్లిలా ఉన్నావని.. జోష్ తగ్గిపోయిందని చెప్పారు. మెహబూబ్ విషయానికి వస్తే... మనం ఎవరని హౌస్‌లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు అనుకోవాలని కానీ బయటకు వెళ్లేటప్పుడు అనుకోకూడదని కాబట్టి ఓపెన్ అవ్వాలని సూచించారు. అభిజిత్ గురించి అందరిపై ఎందుకు అరుస్తున్నావని ప్రశ్నించారు. హారిక గురించి నీకేం తెలుసని అడిగారు. దేవిని క్విక్ హెడ్‌లైన్స్ అడిగ్గా.. ఆమె చకచకా చెప్పేసింది. అమ్మ రాజశేఖర్‌ను కుళ్లు జోక్స్ వేస్తున్నావని చెప్పడమే కాకుండా మొనాల్‌ విషయంలో అంత అవసరమా? అని కాస్త సున్నితంగా మందలించారు.

దివిని.. నీకు వంట చేసే అబ్బాయిలిస్టమా? వంట చేసే అంకుల్స్ ఇష్టమా? అని ప్రశ్నించి సందడి చేశారు. ఇక సూర్యకిరణ్‌ను ఎందుకు అందరికి ఆర్డర్‌లిస్తున్నావు? అందరికీ డైరెక్టర్‌వా? అంటూ కాస్తంత సీరియస్‌గానే చురకలంటించారు. ఇక కరాటే కల్యాణిని.. మొనాల్ విషయంలో ఎందుకు యాడ్ చేశావని ప్రశ్నించారు. అక్కడిది ఇక్కడ.. ఇక్కడిది అక్కడ ఎందుకు అని ప్రశ్నించడమే కాకుడా ఆమెలోని లోపాలన్నీ ఎత్తి చూపి నాగ్ మందలించారు.

ఆ తర్వాత గేమ్ ఆడించారు. పక్కింట్లో ఉండి వచ్చిన అరియానా, సొహైల్‌లు కంటెస్టెంట్‌ల గురించి ఎలా అర్థం చేసుకొన్నారో చెప్పాలన్నారు. అభిజిత్,సుజాతను సేఫ్ జోన్‌లోకి పంపించారు. అనంతరం కట్టప్ప ఎవరో నాగ్ తేల్చేశారు. కట్టప్ప ముద్ర వేయించుకున్న ఐదుగురిని నిలబెట్టి.. ఎవరో కంటెస్టెంట్లే తేల్చాలని సూచించారు. అంతా కలిసి లాస్యను కట్టప్పగా డిసైడ్ చేశారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో కట్టప్ప లేనే లేరని.. మీ అందరిలో ఉన్న డౌటే కట్టప్ప అని అంతటితో ముగించకుండా... అందరూ కట్టప్పగా పేర్కొన్న లాస్యను హౌస్‌కు కెప్టెన్‌ని చేసి.. నామినేషన్ నుంచి కూడా సేవ్ చేసేశారు. అనంతరం గంగవ్వను కూడా సేవ్ చేసేశారు. ఇంకా నామినేషన్‌లోనే సూర్యకిరణ్, మెహబూబ్, దివి, అఖిల్ ఉన్నారు. ఇక హౌస్ నుంచి బయటకు వెళ్లేదెవరో రేపు తెలియనుంది.