Bigg Boss Telugu 7 : హౌస్‌లో ‘‘ఫ్యామిలీ’’ ఎమోషనల్ .. సర్ప్రైజ్ ఇచ్చి కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్‌బాస్
- IndiaGlitz, [Wednesday,November 08 2023]
సోమవారమంతా నామినేషన్స్‌తో బిగ్‌బాస్ హౌస్ హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈసారి మహారాజ్యంలో నామినేషన్లు జరుగుతాయని చెప్పిన బిగ్‌బాస్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ నామినేషన్స్ రాజ్యంలో శోభాశెట్టి, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించారు. తర్వాత శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ తమ వద్ద నున్న కత్తులను తీసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. అలా ఈ వారం భోలే షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్స్‌లో నిలిచారు.
మంగళవారం నాటి ఎపిసోడ్లో గొడవలు, కొట్లాటలకు బదులుగా ఎమోషన్ పండించారు బిగ్‌బాస్. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడాన్ని చూసిన ప్రేక్షకులు.. కంటెస్టెంట్స్ మనసుల్లో వుండే భావోద్వేగాలను మాత్రం చూడలేకపోయారు. ఈ వారం మాత్రం ఆ లోటు తీర్చారు బిగ్‌బాస్. తొలుత శివాజీకి సర్ప్రెజ్ ఇచ్చారు బిగ్‌బాస్. శివాజీకి రెగ్యులర్ చెకప్ కోసం అప్పుడప్పుడు ఓ డాక్టర్ని బిగ్‌బాస్ ఇంటిలోకి పంపుతుంటారు. ఈసారి మాత్రం శివాజీ పెద్ద కుమారుడు శ్రీ.. మాస్క్, కళ్లజోడు , కోట్ ధరించి డాక్టర్ లాగా ఎంట్రీ ఇచ్చాడు. శివాజీ ఆరోగ్యంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆ కుర్రాడు.. వచ్చింది నిజమైన డాక్టరే అనుకున్న శివాజీ అంతా బాగానే వుందని చెబుతాడు. చివరిలో నాన్న అంటూ శ్రీ పిలవడంతో .. శివాజీ ఎమోషనల్ అవుతాడు.
కొడుకుని ఆలింగనం చేసుకుని అందరికీ నా బిడ్డ అంటూ పరిచయం చేస్తాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా శ్రీ ని పలకరిస్తారు. బీటెక్ పూర్తి చేసిన శ్రీ .. మాస్టర్స్ కోసం త్వరలో అమెరికా వెళ్లనున్నాడు. మరో వారంలో అతను అమెరికాకు బయల్దేరతాడు. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో వున్న తండ్రిని కలుసుకోవడానికి వచ్చాడు. ఈ సందర్భంగా అందరినీ నమ్మొద్దని.. నిన్ను రెచ్చగొడుతున్నారని , నువ్వు కూల్‌గా వుండాలంటూ తండ్రికి సలహాలిచ్చాడు. తర్వాత అర్జున్ అంబటి భార్య సురేఖ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆమెను చూడగానే అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. భర్తకు గోరుముద్ధలు తినిపించింది సురేఖ. అయితే ఆమె ప్రస్తుతం గర్భవతి కావడంతో కంటెస్టెంట్స్ అంతా కలిసి సీమంతం వేడుక నిర్వహించారు. అది చూసిన అర్జున్ కన్నీటి పర్యంతమయ్యారు.
అనంతరం అశ్విని తల్లి ఎంట్రీ ఇచ్చారు. అమ్మ ఒడిలో పడుకుని చిన్న పిల్లలా ఏడుస్తూ కంటతడి పెట్టింది అశ్విని. అంతా తనని చిన్న చూపు చూస్తున్నారని.. నాకు ఇక్కడ వుండాలని అనిపించడం లేదని వాపోయింది. దీంతో ఆమె కూతురికి ధైర్యం నూరిపోసింది. నా అన్నవాళ్లంతా , నీవాళ్లు కాదంటూ బిగ్‌బాస్ హౌస్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. తర్వాత అశ్వినికి తన కుక్కపిల్ల ఫోటోను గిఫ్ట్‌గా పంపాడు బిగ్‌బాస్. అమ్మని ఈరోజు ఇక్కడే వుంచమని బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేసింది అశ్విని. అలా ఇవాళ్టీ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది.