బిగ్‌బాస్ 4.. ఈసారి అన్నీ ఆసక్తికర అంశాలే...

  • IndiaGlitz, [Saturday,August 22 2020]

నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 4లో ఈ సారి పలు ఆసక్తికర విషయాలున్నట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ 3లో చేసిన ఓ ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. దీంతో ఈ సారి బిగ్‌బాస్ 4లో నిర్వాహకులు మరో అడుగు ముందుకేస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ 3లో వరుణ్ సందేశ్, వితికా షెరు జంట ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసింది. దాదాపు 10 వారాల పాటు బిగ్‌బాస్ షోలో వీరిద్దరి ప్రయాణం సాగింది. ఈ పది వారాలూ షో మొత్తం దాదాపు వీరి చుట్టూనే తిరిగింది. దీంతో దీనిని కొసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం.

దీనిలో భాగంగానే ఈసారి బిగ్‌బాస్‌ షోలోకి రెండు జంటలు అడుగుపెట్టనున్నట్టు సమాచారం. ఒకటి రఘు మాస్టర్, సింగర్ ప్రణవిల జంట కాగా.. రెండోది మహాతల్లి జాహ్నవి, సుశాంత్‌ల జంట అని టాక్ నడుస్తోంది. బిగ్‌బాస్ 3 లాగే.. సీజన్ 4లో కూడా ఈ ప్రయోగం సఫలమవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమంలో యాంకర్ రవి, లాస్య, ఆటో రాంప్రసాద్, నోయల్, నందు, మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. దీంతో ఈ సారి షో మరింత రసవత్తరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

బిగ్‌బాస్‌లోకి గంగవ్వ..

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఓ పేరు వినిపిస్తోంది. అదే గంగవ్వ. ఇప్పటి వరకూ ఎన్నో పేర్లు వినిపించాయి. కానీ యూ ట్యూబ్ స్టార్‌ గంగ‌వ్వ పేరు మాత్రం వినిపించలేదు. ఈ షోలో ఆమె కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. మై విలేజ్ షోతో గంగ‌వ్వ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలంగాణ యాస‌లో మాట్లాడుతూ ఎంతగానో ఆకట్టుకున్నారు. స‌మంత‌, కాజ‌ల్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్‌ను కూడా ఆమె ఇంట‌ర్వ్యూ చేశారు. ఒక‌వేళ గంగవ్వ బిగ్‌బాస్ 4లో పాల్గొంటే ఇంత పెద్ద వ‌య‌సున్న కంటెస్టెంట్‌ ఈ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది.