ఏ ప్లాన్ వర్కవుట్ కాక... వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ పాప, ‘‘ఆ బూతు’’లతో హౌస్‌లో రచ్చరచ్చ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 6లో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఎపిసోడ్స్ గురించి చెప్పమంటే వ్రేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలా వుంది పరిస్ధితి. తొలి సీజన్ నుంచి నేటి వరకు అదే కాలం చెల్లిన టాస్కులు, ఎంటర్‌టైన్ చేయలేని కంటెస్టెంట్స్ కారణంగా షో మసకబారుతోంది. ఏ సీజన్‌లోనూ లేని విధంగా కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ స్వయంగా తలంటారు. పద్ధతి మార్చుకోకపోతే బయటికి వెళ్లిపోవచ్చునని తేల్చిచెప్పాడు. తర్వాత నుంచి ఇంటిలో కాస్తంత మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. దీనికి తోడు దీపావళి పర్వదినం కావడంతో వేడుకలు, సెలబ్రెటీల రాకతో సందడి కనిపించింది. కానీ ఈ హంగామా మొత్తం ముగియడంతో ఇప్పుడు ఇంటిని నడిపించే బాధ్యత ఇంటి సభ్యులదే. సోమవారం నామినేషన్స్ డే కాబట్టి.. ఎపిసోడ్ అలా ముగిసిపోయింది. మరి మంగళవారం హౌస్‌మెట్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఒకసారి చూస్తే.
గత వారం కెప్టెన్ లేకుండానే ఇంటిని నడిపించాడు బిగ్‌బాస్. కానీ ఈరోజు మాత్రం మనసు మార్చుకున్నట్లుగా వున్నాడు. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ‘‘చేపల చెరువు’’ టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా పై నుంచి పడే చేపలను జాగ్రత్తగా పట్టుకుని వాటిని దాచుకోవాలి. ఎవరైతే ఎక్కువ చేపల్ని పట్టుకుంటారో వారు కెప్టెన్సీకి అర్హత సాధిస్తారు. అయితే టాస్క్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన మాట తీరు, చలాకీతనంతో ఇంటిలో జోష్ నింపే గీతూ పాప ఎందుకో తెలియదు కానీ.. చాలా డల్‌గా కనిపించింది. ఎప్పుడూ నీరసంగా వుండే కీర్తి భట్.. శివంగిలా రెచ్చిపోయింది.
ఇక.. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను జంటలుగా విడదీశాడు బిగ్‌బాస్. సూర్య- వాసంతి, రేవంత్ - ఇనయా, శ్రీహాన్ - శ్రీసత్య, బాలాదిత్య - మెరీనా, ఆదిరెడ్డి - గీతూ, రోహిత్ - కీర్తి, రాజ్ - ఫైమాలు విడి విడిగా ఆడారు. ఆటలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్‌లోకి ఒకరు దిగి గోల్డ్ కాయిన్ వెతకాల్సి వుంటుంది. ఈ కాయిన్ దొరికిన వారికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీరు తమతో ఎవరు పోటీపడొచ్చో కూడా ముందే సెలక్ట్ చేసుకోవచ్చు. ఫిజికల్ టాస్క్ కావడంతో తోసుకోవడం, కొట్టుకోవడం, వాగ్వాదం జరిగింది. ఇందులో గీతూ చాలా కష్టపడింది. ఎంత ట్రై చేసినా చేపలు పొందలేకపోవడంతో స్ట్రాటజీ వాడింది. రేవంత్‌ను రెచ్చగొట్టాలని ఆదిరెడ్డికి చెప్పింది. అప్పుడు ఇనయా ఎక్కువగా చేపలను ఏరలేదని స్కెచ్ గీసింది. కానీ గీతూ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో చేసేది లేక ప్లాన్ బీని తెరపైకి తెచ్చింది. దీనిలో భాగంగా వాసంతి బుట్టలోని చేపలను దొంగిలించేందుకు ట్రై చేసింది. కానీ సూర్య దానిని పసిగట్టి గీతూను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో మెరీనాను టార్గెట్ చేసింది. దీనికి బాలాదిత్య, రోహిత్‌లు గట్టిగా కౌంటరిచ్చారు. అంత కష్టపడి ఆడినా చివరికి ఆదిరెడ్డి- గీతూల దగ్గర తక్కువ చేపలు వుండటంతో గీతూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అంతేకాదు.. వీరిద్దరూ కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పుకోవాల్సిందిగా బిగ్‌బాస్ అనౌన్స్ చేయడంతో గీతూ తన దగ్గర వున్న చేపల్ని గాల్లోకి విసిరేసింది.
సరిగ్గా ఇదే సమయంలో బెల్ మోగింది. ఇందాక చెప్పినట్లు ఓ స్పెషల్ కాయిన్ కోసం ఇంటి సభ్యులు స్విమ్మింగ్‌పూల్‌కి దిగి వెతకడం మొదలుపెట్టారు. లక్కీగా ఆ కాయిన్ రేవంత్‌కి దక్కింది. దీంతో ఎవరితో పోటీపడాలని అనుకుంటున్నారో వారిని సెలక్ట్ చేసుకోవాల్సిందిగా రేవంత్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. రాజ్- ఫైమా, శ్రీహాన్ - శ్రీసత్య, బాలాదిత్య - మెరీనాలు రేవంత్‌తో పోటీ కోసం బరిలోకి దిగారు. ఈ టాస్క్ పేరు ‘‘పుష్ ఫర్ ఫిష్’’. ఒక బండిపై నలుగురు కూర్చొని వుండగా.. నలుగురు పుష్ చేయాలి. ఈ గేమ్ తొలి రౌండ్‌లో మెరీనా- బాలాదిత్య టీమ్ విజయం సాధించగా.. సెకండ్ రౌండ్‌లో రాజ్ - ఫైమా గెలిచి పది చేపలను గెలుచుచున్నారు. అయితే బెల్ మోగినప్పుడు మైక్ ధరించి స్విమ్మింగ్‌పూల్‌లో దిగినందుకు గాను శిక్షగా శ్రీసత్య - సూర్య నుంచి పది చేపలను వెనక్కి తీసుకున్నాడు బిగ్‌బాస్. ఇక టాస్క్ ముగిసే సరికి రేవంత్- ఇనయాల వద్ద అందరికంటే ఎక్కువ చేపలు వున్నాయి.
ఈ రోజు టాస్క్‌లో ఓడిపోయినప్పటికీ మన గీతూ పాప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టాస్క్‌లో గెలిచేందుకు ఆమె చేసిన యత్నాలు. ఏ ప్లాన్ వర్కవుట్ కాకపోయినా.. వెంట వెంటనే ఐడియాలు బయటకు తీస్తూ కాసేపు వినోదాన్ని పంచింది. బిగ్‌బాస్ 6 వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకడిని ఏడిపించడం, తన జోలికి వచ్చిన వాడికి గట్టిగా ఇవ్వడమే తప్పించి ఎమోషనల్ కానీ గీతూ.. తొలిసారిగా కంటతడిపెట్టింది. అంతేకాదు... అందరినీ కావాలనే రెచ్చగొట్టానని, తనను నెట్టేసిన రేవంత్‌ని తన్నడంతో పాటు బూతు పదాన్ని వాడానని క్షమాపణలు కోరింది. మరోవైపు ‘‘చేపల టాస్క్’’ రేపు కూడా కొనసాగే అవకాశాలు వుండటంతో మరి ఈ వారం బిగ్‌బాస్ కెప్టెన్ కిరీటం ఎవరికి దక్కుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments