భార్యాకూతురితో వీడియో కాల్... ఆదిరెడ్డి ఫుల్ రీచార్జ్, బిర్యానీ చాలన్న శ్రీహాన్
- IndiaGlitz, [Wednesday,October 12 2022]
రెండు రోజులు ఇంటికి దూరంగా వున్నా.. ఇంట్లో వాళ్లు కనిపించకపోతేనే మనసంతా దిగాలుగా.. ఏదో పోగొట్టుకున్న వాళ్లలాగా వుంటారు చాలామంది. అలాంటిది కనీసం ఫోన్ కూడా మాట్లాడకపోతే.. ఇక వారి బాధ వర్ణనాతీతం. ఇప్పుడు బిగ్‌బాస్ ఇంట్లో వున్న వాళ్ల పరిస్ధితి కూడా అంతే. ఎలిమినేషన్ అయి వెళ్లిపోయిన వారి సంగతి పక్కనబెడితే.. ప్రస్తుతం ఇంట్లో వున్న వారు హోమ్ సిక్‌లో వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కంటెస్టెంట్స్‌కి తమ వాళ్లు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో 100 శాతం ఛార్జ్ వున్న బ్యాటరీని ఏర్పాటు చేశాడు. అలాగే వారి కోసం కొన్ని సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేశాడు. అయితే కంటెస్టెంట్స్ ఎంచుకునే ప్రతి సర్‌ప్రైజ్‌కి బదులుగా బ్యాటరీలోని కొంత ఛార్జింగ్ తగ్గుతుందని.. అలాగే రూల్స్‌ని అతిక్రమించినా కూడా ఛార్జింగ్ నిలబడదని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు.
దీనిలో భాగంగా తొలుత శ్రీహాన్‌ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు. అక్కడ అతనికి నాన్నతో వీడియో కాల్ మాట్లాడితే 35 శాతం బ్యాటరీ తగ్గిపోతుందని.. సిరికి ఆడియో కాల్ చేస్తే 30 శాతం , ఇంటి నుంచి బిర్యానీ తింటే 15 శాతం ఛార్జింగ్ తగ్గిపోతుందని చెప్పాడు. వీటిలో ఏదో ఒకటి తీసుకోవాలని లేదంటే తర్వాతి పరిణామాలను ఇంటి సభ్యులు మొత్తం అనుభవించాల్సి వుంటుందని హెచ్చరించాడు. ఇతరులు తనకంటే బాధగా వున్నందున వారికి తమ వారితో మాట్లాడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో శ్రీహాన్ తన తండ్రి, ప్రియురాలు సిరితో మాట్లాడే ఛాన్స్‌ని త్యాగం చేశాడు. కేవలం ఇంటి నుంచి వచ్చిన మటన్ బిర్యానీతో సంతృప్తి పడ్డాడు.
తర్వాత సుదీపని పిలిపించాడు బిగ్‌బాస్. ఆమెకు భర్త రంగనాథ్‌తో మాట్లాడాలంటే 30 శాతం , భర్త టీషర్ట్ పొందాలంటే 40 శాతం, అమ్మ చేసిన చికెన్ కర్రీ కావాలంటే 35 శాతం బ్యాటరీ ఖర్చు అవుతుందని చెప్పాడు. ఈ మూడింటిలో భర్తతో మాట్లాడేందుకు మొగ్గు చూపింది సుదీప.
ఇక ఈరోజు అన్నింటిలోకి హైలెట్ ఆదిరెడ్డిదే. కన్ఫెషన్ రూమ్‌లోకి ఆదిరెడ్డిని పిలిచిన బిగ్‌బాస్.. భార్యాకూతురితో వీడియో కాల్ మాట్లాడేందుకు 40 శాతం, భార్యతో ఆడియో కాల్‌కి 30 శాతం, కూతురు పంపిన టీషర్ట్ ధరించాలంటే 35 శాతం బ్యాటరీ ఖర్చు అవుతుందని చెప్పాడు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన ఆదిరెడ్డి.. చివరికి భార్యా బిడ్డలతో వీడియో కాల్ మాట్లాడే ఆప్షన్ ఎంచుకున్నాడు. భార్య కవిత, కూతురు హద్వితలను చాలా రోజుల తర్వాత చూడగానే ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు.
అయితే కవిత చాలా అద్భుతంగా మాట్లాడారు. భర్తలో ఆత్మ విశ్వాసం నింపేలా చేసింది. ఒకప్పుడు బిగ్‌బాస్‌కి వెళ్లొద్దని తానే చెప్పానని.. కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు చాలా గర్వపడుతున్నానంటూ కవిత అన్నారు. నీ వైపు తప్పు లేనప్పుడు అవతల ఎవరున్నా సరే ఆర్గ్యుమెంట్ చేయ్ అంటూ సూచించింది. రివ్యూవర్ కంటెస్టెంట్ అయ్యాడు.. కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు... కెప్టెన్ బిగ్‌బాస్ విన్నర్‌గా అయ్యి రావాలని కవిత ఆకాంక్షించారు. భార్య మాటలకు పొంగిపోయిన ఆదిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం నాన్నని, చెల్లిని బాగా చూసుకో.. పాప బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయి.. నేను గేమ్ బాగా ఆడతానని భార్యకు మాట ఇచ్చాడు.