బిగ్‌బాస్ 5 విజేత సన్నీకి కరెంట్ షాక్.. ప్రె‌స్‌మీట్‌లో వుండగానే ఘటన, వీడియో వైరల్

  • IndiaGlitz, [Wednesday,December 22 2021]

హోరాహోరీగా జరిగిన బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌ విజేతగా వీజే సన్నీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో షన్ముఖ్, శ్రీరామ్, సిరి, మానస్‌లను దాటుకుని ఆయన టైటిల్ సొంతం చేసుకున్నారు. దీంతో నాటి నుంచి నేటి వరకు వీజే సన్నీ పేరు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియాలోనూ మారుమోగుతోంది. ఈ క్రమంలో ఆయన ఇంటర్వ్యూలో కోసం బడా ఛానెల్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ వరకు పోటీపడుతున్నాయి.

దీనితో భాగంగానే మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో సన్నీ పాల్గొని.. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా కరెంట్‌ షాక్‌ తగిలింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కాగా.. 1989 ఆగష్టు 17న ఖమ్మంలో జన్మించిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. ఖమ్మం నగరంలోనే స్కూల్, ఇంటర్ పూర్తి చేసుకున్న సన్నీ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో ఉన్న సన్నీకి తన తల్లి కళావతి కూడా అండగా నిలవడంతో అవకాశాల కోసం ప్రయత్నించాడు. చిన్న వయస్సులో సన్నీ వేసిన 'అల్లాద్దీన్' నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది.

తర్వాత ఓ ఛానెల్‌లో 'జస్ట్ ఫర్ మెన్' అనే టీవీ షోకి యాంకర్‌గా పనిచేసే అవకాశం రావడంతో బుల్లితెరపైనా ఇరగదీశాడు. ఆ తరువాత తెలుగులోని ఓ టాప్ న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా సన్నీ కొంతకాలం పని చేశాడు. తర్వాత 'కళ్యాణ వైభోగం' అనే సీరియల్‌లో జయసూర్య అనే క్యారెక్టర్‌లో సన్నీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే అనుకోని కారణాలతో సీరియల్ నుంచి తప్పుకుని బిగ్‌బాస్‌లో చోటు దక్కించుకున్నాడు. త్వరలోనే సన్నీ హీరోగా నటించిన 'సకలగుణాభిరామ' సినిమా విడుదల కానుంది.