ఎవరీ వీజే సన్నీ.. జర్నలిస్ట్ స్థాయి నుంచి బిగ్‌బాస్ విన్నర్ ఎలా కాగలిగాడు..?

  • IndiaGlitz, [Monday,December 20 2021]

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా వినిపిస్తున్న మాట వీజే సన్నీ. ఎవరో సన్నీ అంట బిగ్‌బాస్‌గా గెలిచాడట అని సోమవారం ఉదయం టీ కొట్ల వద్ద, పక్కింటి పిన్ని గారితో ఇలా ఎక్కడ చూసినా సన్నీ పేరే వినిపిస్తోంది. సాధారణ జర్నలిస్ట్ స్థాయి నుంచి బిగ్‌బాస్ స్థాయికి చేరిన ఇతని ప్రస్థానం ఒక ఇన్స్‌పిరేషన్.

1989 ఆగష్టు 17న ఖమ్మంలో జన్మించిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. ఖమ్మం నగరంలోనే స్కూల్, ఇంటర్ పూర్తి చేసుకున్న సన్నీ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో ఉన్న సన్నీకి తన తల్లి కళావతి కూడా అండగా నిలవడంతో అవకాశాల కోసం ప్రయత్నించాడు. చిన్న వయస్సులో సన్నీ వేసిన 'అల్లాద్దీన్' నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ఓ ఛానెల్‌లో 'జస్ట్ ఫర్ మెన్' అనే టీవీ షోకి యాంకర్‌గా పనిచేసే అవకాశం రావడంతో బుల్లితెరపైనా ఇరగదీశాడు. ఆ తరువాత తెలుగులోని ఓ టాప్ న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా సన్నీ కొంతకాలం పని చేశాడు.

తర్వాత 'కళ్యాణ వైభోగం' అనే సీరియల్‌లో జయసూర్య అనే క్యారెక్టర్‌లో సన్నీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే అనుకోని కారణాలతో సీరియల్ నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే అతను హీరోగా నటించిన 'సకలగుణాభిరామ' సినిమా విడుదల కానుంది. సన్నీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఎప్పుడో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సన్నీ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత రిలీజ్ చేద్దామని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ విజేతగా ఆయన నిలబడం ‘‘సకలగుణాభిరామ’’కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.

బిగ్‌బాస్ జర్నీ ఇలా : తొలుత సాధారణ కంటెస్టెంట్‌లాగా అడుగుపెట్టిన సన్నీ.. టాప్‌ 5కి చేరుకున్నాడు. నాగ్ ఇచ్చే సూచనలను ఫాలో అవ్వడంతో పాటు తన గేమ్ స్ట్రాటజీని ఎప్పటికప్పుడు మార్చుకున్నాడు. ఎలాంటి టాస్క్ ఇచ్చినా 100 శాతం ఇచ్చేవాడు. వేటగాడు - కోతి, ప్రభావతి- గుడ్లు వంటి టాస్క్‌ల్లో సన్నీ మార్క్ కనిపిస్తుంది. టాస్క్‌ల సమయంలో తోటి కంటెస్టెంట్స్‌తో గొడవ పడినా వెంటనే వచ్చి కలిసిపోయేవాడు. ఇది సన్నీపై మంచి అభిప్రాయాన్ని కలిగించింది. అందరిని ‘‘మచ్చా’’ అని పిలుస్తూ అభిమానాన్ని సంపాదించాడు. అయితే ‘‘బ్యాటన్ టాస్క్’’ సమయంలో సన్నీ ఇంటి నుంచి వెళ్లిపోతాడని అందరూ అనుకున్నారు.

సిరి షర్టులో చేయి పెట్టాడంటూ జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు.. దీనికి షణ్ముఖ్ కూడా వంత పాడటంతో మనోడి పని అయిపోయిందని ఫిక్సయ్యారు. అయితే నాగార్జున ‘‘వీడియో’’ ప్లే చేసి వివాదానికి తెరదించారు. ఇక ప్రియతో గొడవల కారణంగా సన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ మొదలైంది. ఆమె చేసిన ‘‘చెంప పగిలిపోతుంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సన్నీపై సింపతీని పెంచి ఓట్లు తెచ్చిపెట్టాయి. ఇక ‘‘అప్పడం’’ గురించి చెప్పాల్సిన పనే లేదు. బిగ్‌బాస్ 5వ సీజన్‌లో జనానికి గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్‌లో ఇది కూడా ఒకటి. గేమ్స్, టాస్క్‌తో పాటు స్నేహానికి సన్నీ ప్రాణం ఇచ్చేవాడు. మానస్, యానీ మాస్టర్, కాజల్‌తో సన్నీ మంచి ఫ్రెండ్‌షిప్ కొనసాగించాడు.

ముఖ్యంగా మానస్‌తో విడదీయరాని బంధం ఏర్పరచుకున్నాడు. మానస్, కాజల్‌లు సన్నీకి ప్రతి విషయంలోనూ హెల్ప్ చేసేవారు. అందుకే ‘‘ఎంఎస్‌కే’’ (మానస్ , సన్నీ, కాజల్) లాగా వుండాలి రా మచ్చ అంటూ సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యింది. ఒకానొక సమయంలో బిగ్‌బాస్‌పై జనానికి బోర్ కొడుతున్న వేళ.. తన పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపాడేశాడు. చివరి వారాల్లో హమీదా, ప్రియాంకల గెటప్‌లు వేసుకుని నవ్వించాడు సన్నీ. చివరికి తరచు చెప్పే ‘‘కప్పు ముఖ్యం బిగిలూ’’ అన్న మాటను నిజం చేసి బిగ్‌‌బాస్ 5 తెలుగు విజేతగా నిలిచాడు.