బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి ఎలిమినేషన్... రీఎంట్రీ, ముద్దుల వర్షం కురిపించిన షన్నూ

  • IndiaGlitz, [Saturday,December 18 2021]

బిగ్‌బాస్ 5 తెలుగు మరో రెండు రోజుల్లో ముగియనుంది. గత కొన్నిరోజులుగా కంటెస్టెంట్స్‌ జర్నీలు చూపించిన బిగ్‌బాస్ నిన్న మాత్రం టాస్క్‌లు ఆడించారు. అలా సరదాగా సాగుతున్న వేళ.. సిరిని ఎలిమినేట్ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ సిరిని ఎందుకు ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..? తెలియాలంటే ఈ ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

నిన్నటి ఎపిసోడ్‌లో సన్నీతో జరిగిన గొడవతో సిరి బాగా ఫీలైంది. నిద్రపోకుండా అలాగే ఏడుస్తూ కూర్చుంది. దీనిని గమనించిన షన్నూ ఆమెను ఓదార్చాడు. నేనేదైనా అంటే ఫీల్‌ అవ్వాలని.. ఎవరో ఏదో అన్నారని ఏడవద్దు, మూసుకుని కూర్చో అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత జాతకాలు చెప్పే శాంతి అనే లేడీ ఎంట్రీ ఇచ్చింది. సన్నీ ఎంపరర్‌ అని, ఆయన లైఫ్‌ ఈ షోతో కొత్తగా బిగిన్‌ అవుతుందని తెలిపింది. మరోవైపు ఆయన జీవితంలో లవ్‌ ఉందని, కాకపోతే కెరీర్‌ ముందు, ఆ తర్వాతే ప్రేమ అని చెప్పింది. మానస్‌ అన్ని చూశాడని, కామ్‌ గోయింగ్ గాయ్‌ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. శ్రీరామ్‌ ప్రేమ జీవితం బాగుంటుందని తెలిపింది. అతని లైఫ్‌లో అమ్మాయి ఉందని తెలిపింది.

సిరికి హౌస్ నుంచి బయటకు వెళ్లాక పెళ్లి జరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక షణ్ముఖ్‌ విషయానికి వస్తే ఆయనకు లైఫ్‌లో అన్నీ బాగా జరుగుతాయని, విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉందని, ఆర్థికంగానూ సెటిల్ అవుతాడని తెలిపింది. అయితే ఆయన లవ్‌ లైఫ్‌ విషయంలో ట్విస్ట్ ఇచ్చింది. నేను హౌస్‌లో లవ్ గురించి చెప్పాలా? బయట లవ్‌ లైఫ్‌ గురించి చెప్పాలా? అనడంతో సిరి, షణ్ముఖ్‌లు సైలెంట్ అయ్యారు. కాసేపటి తర్వాత షణ్నూ బయట మాది ఐదేళ్ల రిలేషన్‌షిప్‌, తర్వాత ఎలా ఉండబోతున్నాం అని దీప్తి సునయన గురించి అడిగాడు. మీలో ఉన్న చిన్నచిన్న భయాలను తీసేస్తే అంతా హ్యాపీ అని జ్యోతిష్యురాలు శాంతి చెప్పింది.

జాతకాల సెషన్‌ పూర్తయిన తర్వాత ఫుడ్‌ విషయంలో సిరికి, షణ్ముఖ్‌కి మధ్య గొడవ జరిగింది. సిరి ఉదయం దోశలు చేస్తే అవి తినలేదని, అలానే ఉంచారని అంటాడు షణ్ముఖ్‌. అయితే తాను చేశాను, కానీ ఆ తర్వాత తిన్నారో లేదో తెలియదని బదులిచ్చింది. ఏం తెలుస్తుంది, ఏం తెలియదు, చూసుకోవాలి కదా, చెబితే వినాలి కదా అంటూ కోపపడ్డాడు షణ్ముఖ్‌. దీంతో సిరికి కోపం వచ్చి.. ఎందుకు తినలేదని మానస్‌ను ప్రశ్నించింది. తాను తిన్నానని .. సన్నీకి రైస్‌ తినాలనిపిస్తే పులిహోర చేసుకున్నాడని మానస్ చెప్పాడు. దీనికి బాగా హర్ట్ అయిన సిరి, షణ్నూలు మా వంట మేము చేసుకుంటామని తేల్చి చెప్పేశారు.

తర్వాత ఇంట్లోని సభ్యులంతా సూట్ కేసులు రెడీ చేసుకుని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. గ్రాండ్‌ ఫినాలే కంటే ముందు ఇంటి సభ్యుల్లో ఒకరి ప్రయాణం ఈ రోజుతో పూర్తయ్యిందని.. అది ఎవరో నిర్ణయించుకోవాలని సభ్యులను కోరాడు. షన్ను మాట్లాడుతూ.. సన్నీ పేరు చెప్పాడు. మానస్.. షణ్ముఖ్ పేరు, సిరి.. మానస్ పేరు, శ్రీరామ్.. సిరి పేరు, సన్నీ.. షన్నూ పేరు చెప్పాడు. అనంతరం బిగ్‌బాస్.. సిరి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని ప్రకటించాడు. దీంతో సిరి.. ‘‘బిగ్‌బాస్ మీరు జోక్ చేస్తున్నారు కదూ.. నేను వెళ్లను అని భీష్మించుకుని కూర్చుంది’’. అదే సమయంలో బిగ్‌బాస్ గేట్స్ తెరవడంతో చేసేది లేక సిరి బయల్దేరడానికి సిద్ధమైంది. ఇంటి నుంచి బయటకు వెళ్తూ.. షన్నును గట్టిగా హగ్ చేసుకుంది. దీంతో షన్ను కూడా ఎమోషనలై.. ఆమె నుదుటి మీద కిస్ చేశాడు. వెళ్తూ.. వెళ్తూ.. షన్నుకు ‘ఐ లవ్ యూ’, ‘ఐ మిస్ యూ’ అని చెప్పింది. సిరి వెళ్లిపోతుంటే గేట్‌ వద్దే కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు షణ్ముఖ్‌.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన సిరికి కళ్లకు గంతలు కట్టి.. కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. మీరు ఎలిమినేట్ కాలేదని, ఇంకా సేఫ్‌గానే ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు. మళ్లీ హౌస్‌లోపలికి పంపిస్తామని వెల్లడించారు. మరోవైపు బాధతో ఉన్న షన్నును మానస్ ఓదార్చే ప్రయత్నం చేశాడు.  షన్ను ఒంటరిగా ఉండటం చూసి సిరి ఏడ్వడం మొదలుపెట్టింది. తనను వెంటనే ఇంట్లోకి పంపించాలని, తాను లేకపోతే షన్ను ఉండలేడని వాపోయింది. దీనిపై స్పందించిన బి‌గ్‌బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్ నుంచి హౌస్‌లోకి వెళ్లాల్సిందిగా చెప్పాడు. అంతే సిరి ఆనందంతో లోపలికి పరిగెత్తింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లి షన్ను హగ్ చేసుకుని ముద్దులు పెట్టింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ 4 సీజన్‌లలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ సందడి చేయనున్నారు.