బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీకి నాగ్ వార్నింగ్.. హౌస్‌లో నాగినిగా కాజల్, మిగతా పాములు ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగుకు సంబంధించి చూస్తుండగానే వీకెండ్ వచ్చింది. ఎప్పటిలాగానే నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి పంచాయతీ పెట్టి కంటెస్టెంట్స్ చేసిన టాస్క్‌ల్లో తప్పులను ఎత్తిచూపారు. లెటర్స్ వదులుకున్న ఇంటి సభ్యులను నాగ్ అభినందించారు. తనను బయటకు పంపేయాలంటూ రవి అన్న మాటలను ప్లే చేసి చూపించి కింగ్.. వెళ్లిపోతావా అని ప్రశ్నించగా రవి వివరణ ఇచ్చాడు. ఇక సన్నీకి ఓ రేంజ్లో క్లాస్ పీకారు నాగ్. దీంతో సన్నీ దిగిరాక తప్పలేదు. మరి ఈ రోజు ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ఉదయాన్ని ఇంటిసభ్యులకు పూరీ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్ . ఎవరైతే సరిగ్గా 50 పూరీలు చేస్తారో వారు విజయం సాధించినట్లు అని చెప్పాడు. రెండు టీమ్ లుగా విడిపోయి పూరీలు తయారు చేశారు హౌస్ మేట్స్. ఈ క్రమంలో కాజల్, సిరి, మానస్ గ్రూప్ 50 పూరీలు త్వరగా చేసినా అందులో కొన్ని నూనెలో సరిగా వేగలేదు. అదే సమయంలో యానీ మాస్టర్, శ్రీరామ్, విశ్వ, లోబో, రవి టీమ్ 50 పూరీలను బాగా చేయడంతో ఈ టీమ్ గెలిచినట్లుగా కెప్టెన్ షణ్ముఖ్ ప్రకటించాడు. జైలులో ఉన్న సన్నీ ఈ విషయంలో కలగజేసుకోవడంతో యానీ మాస్టర్‌కి కోపం వచ్చింది. సన్నీ మాట్లాడటానికి బుద్ధి ఉండాలి’ అని అనడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత హౌస్ మొత్తం గ్రూప్‌లుగా విడిపోయి ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.
దీనిని చూసి కెప్టెన్ షణ్ముఖ్ ముసిముసి నవ్వులు చిందించాడు. అసలే యానీతో గొడవై వున్న సన్నీకి అది చూసి ఒళ్లు మండింది. 'ఇక్కడ హౌస్ లో కొంతమంది బాధపడుతుంటే.. అక్కడ కూర్చొని నవ్వడం కరెక్ట్ కాదని' షణ్ముఖ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బయటకొస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దానికి షణ్ముఖ్ సెటైరికల్‌గా ఇప్పటినుంచే భయమేస్తుందని కౌంటర్ వేశాడు. 'ఇప్పుడే పోస్కోని వచ్చా.. లేకపోతే మళ్లీ వెళ్లేవాడిని' అంటూ కామెంట్ చేశాడు. 'భయపడ్డావ్ కాబట్టే నన్ను లోపల పెట్టావ్' అంటూ సన్నీ ధీటుగా బదులిచ్చాడు. ఆ తరువాత కొద్దిసేపటికే జైలు నుంచి బయటకొచ్చిన సన్నీ.. శ్రీరామ్ తో డిస్కషన్ పెట్టాడు.
ఈ గొడవలతో హౌస్ అంతా రణరంగంగా మారిపోయిన సమయంలో స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. నామినేషన్ టాస్క్ లో లెటర్స్ ను వదిలేసుకున్న సిరి, షణ్ముఖ్, రవి, లోబో, మానస్, శ్రీరామ్ లను స్పెషల్ గా అప్రిషియేట్ చేశాడు. అనంతరం రవి.. తాను డబ్బుల గురించి ఇక్కడికి రాలేదని, నా భార్యాపిల్లలు ఎలా ఉన్నారో చెప్పండని, లేదంటే బిగ్‌బాస్ నుంచి పంపేయండి అని మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ప్లే చేసి చూపించారు నాగ్. నువ్వు వెళ్లిపోతానంటే చెప్పు గేట్లు ఓపెన్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి రవి స్పందిస్తూ.. తాను కావాలని అలా అనలేదని.. అప్పుడు అలా అనిపించిందని వివరణ ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్‌ను మధ్యలో వదిలేసిన యానీ మాస్టర్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎందుకు? అని ప్రశ్నించాడు. ఇకపై డల్‌గా ఉండొద్దని సూచించాడు. కాజల్‌ను తొండాట వద్దని, పద్ధతిగా ఆడమని నాగార్జున హితవు పలికారు. తర్వాత సన్నీ ఫొటోను చేతులతో చింపేసిన నాగ్.. వరస్ట్ పర్ఫామర్‌గా జైలుకు పంపించినా నీలో మార్పు రాలేదా? అని మండిపడ్డారు. ఒక వ్యక్తి పట్టుకున్న బ్యాగును తన్నడం సరైనదా? అని చీవాట్లు పెట్టారు. దీంతో రియాక్ట్ అయిన సన్నీ.. తన ప్రవర్తన పట్ల క్షమాపణలు కోరాడు. ఇకపై అలా జరగకుండా చూసుకుంటానని చెప్పాడు.
అనంతరం నాగ్ .. మానస్‌తో మాట్లాడుతూ.. గేమ్ ఆడే ముందు కొంచెం ఆలోచించు అని సలహా ఇచ్చారు. 'ఈ హౌస్ లో ఏమైనా అన్యాయం జరుగుతుందని అనిపిస్తుందా..?' అని ప్రశ్నించగా.. అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు అని మానస్ బదులిచ్చాడు. ఈ వారం ఎవరు అన్యాయం చేశారనిపిస్తుందని అని అడగ్గా.. సంచాలక్‌గా జెస్సీ అన్యాయం చేశాడనిపించిందని ఆన్సర్ ఇచ్చాడు. దానికి నాగార్జున.. సంచాలక్ డెసిషనే ఫైనల్ అని చెప్పారు. తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో బాగానే ఆడావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే నీ దృష్టి యానీ మాస్టర్ పై పెట్టావ్ అని పింకీని సున్నీతంగా మందలించారు. జెస్సీతో మాట్లాడుతూ.. సంచాలక్‌గా వున్నప్పుడు గేమ్‌ని బాగా అర్ధం చేసుకొని ఆడమని సలహా ఇచ్చారు నాగార్జున.
తర్వాత ఇంటి సభ్యులతో వైకుంఠపాళి గేమ్ ఆడించాడు నాగ్. ఈ ఇంట్లో పైకి వెళ్లకుండా కాటేసేది, ముందుకు వెళ్లడానికి నిచ్చెనలా సాయం చేసేది ఎవరో చెప్పాలని ఆదేశించాడు. ముందుగా కాజల్ - నిచ్చెన మానస్ కి ఇచ్చి.. స్నేక్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. రవి - నిచ్చెన, స్నేక్ రెండూ లోబో అనే అనిపిస్తుందంటూ నిచ్చెన షణ్ముఖ్ కి, స్నేక్ కాజల్ కి ఇచ్చాడు. జెస్సీ - నిచ్చెన విశ్వకి ఇచ్చి, స్నేక్ సన్నీకి ఇచ్చాడు. ప్రియాంక - నిచ్చెన మానస్ కి .. స్నేక్ లోబోకి ఇచ్చింది. సన్నీ - నిచ్చెన మానస్ కి.. స్నేక్ షణ్ముఖ్ కి ఇచ్చాడు. విశ్వ - నిచ్చెన లోబోకి .. కాజల్ కి స్నేక్ ఇచ్చాడు. లోబో - నిచ్చెన రవికి ... సన్నీకి స్నేక్ ఇచ్చాడు. శ్రీరామ్ - యానీ మాస్టర్‌కి నిచ్చెన .. కాజల్ కి స్నేక్ ఇచ్చాడు. యానీ మాస్టర్ - రవికి నిచ్చెన ... కాజల్ కి స్నేక్ ఇచ్చింది. మానస్ - సన్నీకి నిచ్చెన .. రవికి స్నేక్ ఇచ్చాడు. షణ్ముఖ్ - సిరికి నిచ్చెన .. రవికి స్నేక్ ఇచ్చాడు. సిరి - షణ్ముఖ్ కి నిచ్చెన .. సన్నీకి స్నేక్ ఇచ్చింది. దీంతో నాగిని ఆఫ్ ది హౌస్ కాజల్ గా, స్నేక్ ఆఫ్ ది హౌస్ సన్నీకి ఇచ్చారు నాగార్జున.
అనంతరం 'మెడలో మోత- సరిపోయే సామెత' గేమ్ ఆడించాడు నాగ్. ఇందులో తాను సామెతలు చెప్తే దానికి సంబంధించిన ప్లేట్‌ను ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలని చెప్పారు. సన్నీ ‘కుక్కతోక వంకర’ సామెతను జెస్సీకి ఇచ్చాడు. ‘అబద్ధం ఆడినా అతికినట్టు ఉంటుంది’ సామెతను రవికి ఇచ్చాడు మానస్. ఇక కాజల్ ‘ఏమీ లేని ఆకు ఎగిరెగెరి పడుతుంది’ అంటూ శ్రీరామ్ మెడలో బోర్డు వేసింది. యానీ మాస్టర్ ‘రాను రాను రాజు గుర్రం గాడిద అయింది’ సామెను కాజల్‌కు ఇచ్చింది. ‘కందకు లేని దురద కత్తి ఎందుకు’ సామెతను సిరి మెడలో వేసింది ప్రియాంక. ‘అంతంత కోడికి అర్ధశేరు మసాలా’ సామెత బోర్డును కాజల్ మెడలో శ్రీరామ్ వేశాడు. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ సామెతను లోబో మెడలో వేశాడు విశ్వ. ఇక ‘పైన పటారం లోన లొటారం’ బోర్డును సన్నీకి ఇచ్చాడు జెస్సీ. సిరి ‘అందని ద్రాక్షపళ్లు పుల్లన’ సామెతను షణ్ముఖ్ మెడలో వేసింది. ‘ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడు’ అనే సామెతను రవికి ఇచ్చాడు షణ్ముఖ్. ‘ఓడ ఎక్కేవరకూ ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న’ సామెతను మానస్‌కు ఇచ్చాడు రవి. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం’ సామెతను యానీ మాస్టర్‌కు ఇచ్చాడు లోబో. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు సేవ్ అవుతారో చూడాలి. ఇదిలా వుంటే ఆదివారం నాటి దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో శ్రియ, సుమ, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు గెస్ట్స్‌గా రాబోతున్నారు. మరి అది చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments