బిగ్‌బాస్ 5 తెలుగు: టాస్క్ మధ్యలో కంట్రోల్ తప్పిన షణ్ముఖ్-సన్నీ-సిరి... కొత్త కెప్టెన్‌గా రవి
Send us your feedback to audioarticles@vaarta.com
కెప్టెన్సీ పోటీదారుల కోసం జరుగుతున్న బీబీ హోటల్ టాస్క్ ఫన్‌తో పాటు గొడవలు కూడా పెట్టింది. షణ్ముఖ్- సిరి- సన్నీ, యానీ మాస్టర్- కాజల్‌ల మధ్య గొడవ తారాస్థాయికి చేరి.. పర్సనల్‌గా కామెంట్స్ చేసుకున్నారు. టిప్పు కోసం సన్నీని యానీ మాస్టర్ ఎత్తుకుని తిరగడం హైలెట్‌గా నిలిచింది. ఈరోజుతో బీబీ హోటల్ టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఎవరు ఇందులో విజయం సాధించారో... ఈరోజు జరిగిన గొడవలేంటో తెలియాలంటే ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
బీబీ హోటల్ టాస్క్‌లో రవి సీక్రెట్ టాస్క్ గురించి ఇంటి సభ్యులకు తెలిసిపోయిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాజల్ డబ్బులు దొంగిలించిన రవి వాటిని ఆమెకు తిరిగిచ్చేశాడు. మరోవైపు టిప్పు కోసం యానీ మాస్టర్ సన్నీని ఎత్తుకుని తిప్పింది. దీంతో ఆమెకు వంద రూపాయలు టిప్పు ఇచ్చాడు. మరోవైపు కాజల్‌కి రవి, షణ్ముఖ్ కథలు చెప్పారు. ఇందులో రవి చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన కాజల్ వంద రూపాయలు టిప్పు ఇచ్చింది.
తర్వాత బీబీ హోటల్ టాస్క్ ముగిసిందని ప్రకటించాడు బిగ్‌బాస్. టాస్క్ ముగిసే సమయానికి హోటల్ సిబ్బంది దగ్గర రూ.9,500 మాత్రమే ఉండగా... అతిథులు దగ్గర నుంచి 15 వేల రూపాయలు తెచ్చుకోలేకపోయిన హోటల్ సిబ్బంది ఓడిపోయారని, గెస్ట్‌ల టీమ్ గెలిచిందని ప్రకటించాడు బిగ్‌బాస్. ఇక ఆ రాత్రి రవి, షణ్ను, సిరి డిస్కషన్ పెట్టుకున్నారు. మానస్ ఎక్కువ పని చేస్తాడు కానీ సన్నీ మాత్రం ఎప్పుడూ తప్పించుకుని తిరుగుతాడని గుసగుసలాడారు.
రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అతడు మొదటి కెప్టెన్సీ పోటీదారుడయ్యాడు. హోటల్ స్టాఫ్ ప్రదర్శనను అభినందిస్తూ.. వాళ్లకి ఒక పవర్ ఇచ్చారు బిగ్‌బాస్. అదేంటంటే.. హోటల్ స్టాఫ్ అంతా కలిసి అతిథుల టీమ్ నుంచి కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు అనర్హులుగా భావించే ఇద్దరు సభ్యుల పేర్లను, తగిన కారణాలతో చెప్పాలని ఆదేశించారు. దీంతో వాళ్లంతా మాట్లాడుకుని.. మానస్-ప్రియాంక పేర్లు చెప్పారు. దీంతో ప్రియాంక ఫైర్ అయింది... షణ్ముఖ్ ఇచ్చిన రీజన్ బాలేవని మండిపడింది. అతడికి సిరితో ఉండడమే సరిపోయిందని.. టాస్క్ లో మన దగ్గరకు ఎక్కడ వచ్చాడంటూ మానస్,సన్నీల దగ్గర కామెంట్ చేసింది. ఫైనల్‌గా రవి, సిరి, సన్నీ, కాజల్‌లను కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ప్రకటించారు బిగ్ బాస్.
అనంతరం 'టవర్ లో ఉంది పవర్' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో పోటీదారులు ఎత్తైన టవర్ ను నిర్మించి అది కూలిపోకుండా కాపాడుకోవాలి. వేరే వాళ్ల టవర్స్‌ను బాల్స్ విసిరి కూల్చే ప్రయత్నం చేయొచ్చని చెప్పారు. అలాగే హౌస్ మేట్స్ ఎవరికైతే మద్దతు తెలుపుతారో.. వాళ్ల టవర్‌ను కాపాడాలని చెప్పారు. ఫస్ట్ రౌండ్ లో కాజల్, సెకండ్ రౌండ్లో సన్నీ, మూడో రౌండ్లో సిరి ఓడిపోయారు. అయితే సెకండ్ రౌండ్లో తనకు సిరి అడ్డుపడడంతో సన్నీ ఫైర్ అయ్యాడు. 'నేను గేమ్ ఆడితే నిన్ను అప్పడంలా తొక్కేస్తా' అని సిరిపై కేకలు వేశాడు. వీరిద్దరి మధ్యలోకి షణ్ముక్ రావడంతో.. సన్నీ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. దమ్ము లేదని, చేతకాని ఆటలు ఆడతారని షణ్ముఖ్‌ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు.
తాను కూడా టవర్‌ని తంతాను అని అన్నాడు సన్నీ. ఎవరిని తంతావ్ అంటూ మీది మీదికి వచ్చింది సిరి. దీనికి షణ్ముఖ్ రియాక్ట్ అయ్యాడు. ఎవరిని అప్పడం చేస్తావ్, చేయిరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఏరా పోరా అనే స్థాయి దాటి, కొట్టుకుందామా... కొడతావా అనే రేంజ్ కి వెళ్ళింది . మానస్, కాజల్, యానీ మాస్టర్లు కలుగ చేసుకుని ఇద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రవిని సపోర్ట్ చేస్తోన్న యానీ మాస్టర్ దగ్గరకు వెళ్లి.. ఆమెకి కితకితలు పెట్టబోయింది కాజల్. దానికి యానీ రియాక్ట్ అవుతూ 'డోంట్ డూ దట్' అంటూ గట్టిగా అరిచింది.
ఆ తరువాత యానీ.. 'నీ గేమ్ అయిపోయింది కదా.. నువ్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావ్' అని కాజల్ ని ప్రశ్నించింది. దానికి రవి సైడ్ అని చెప్పింది కాజల్. 'రవి సైడ్ అని చెప్పి.. రవి సైడ్ వాళ్లకే గిలిగింతలు పెడతావా..?' అని ప్రశ్నించింది. 'అవును మాస్టర్.. నా గేమ్ అదే' అని బదులిచ్చింది కాజల్. 'నీ గేమ్ నువ్ ఆడుకో.. నా దగ్గరకు రాకు.. డోంట్ టచ్ మీ' అంటూ గట్టిగా అరిచింది యానీ. దానికి కాజల్ ఇక అలా చేయనని చెప్పింది. ఈ క్రమంలో ' నాగిన్' అంటూ డాన్స్ చేసింది యానీ మాస్టర్. మాటలే కాదు.. యాక్షన్స్ కూడా లూజ్ అవుతున్నారంటూ కాజల్ పంచ్ పేల్చింది 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' అంటూ యానీ.. కాజల్ పై ఫైర్ అయింది. ఫాల్తూ, బేవకూఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా వుంటే పింకీ చీర తగిలి టవర్ కూలిపోవడం సన్నీ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. అయితే పింకీ కావాలనే టవర్‌ను కూల్చిందని సన్నీ, మానస్ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే మోసం చేస్తే ఇంకేం చేయాలని బాధపడ్డారు. ఈ క్రమంలోనే చివరి వరకు తన టవర్‌ని కాపాడుకున్న రవి ఈ వారం కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments