బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్ రుణం తీర్చుకున్న సన్నీ.. రవి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చిన ఇంటి సభ్యులు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో 12వ వారం ఎవ్వరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం హౌస్‌మేట్స్‌ని షాక్‌కి గురిచేసింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎలిమినేషన్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక బిగ్‌బాస్ షో విజేతలకు హోస్ట్ నాగార్జున బంపరాఫర్ ప్రకటించారు. ఈ సీజన్‌లో టైటిల్ విన్నర్‌కు రూ.50 లక్షలతో పాటు రూ.25 లక్షల విలువ చేసే ఇంటి స్థలాన్ని కూడా కానుకగా ఇస్తామన్నారు. మరి డబ్బుతో ఎవరేం చేస్తారని నాగ్ ఇంటి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారో.. అసలు రవి ఎలా ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
సండే ఫండే కావడంతో నాగార్జున ఎప్పటిలాగే ఇంటి సభ్యులతో సరదాగా గేమ్స్ ఆడించారు. ఇక సీజన్ ముగియడానికి మరికొద్దిరోజులే వుండటంతో బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఇవ్వబోయే ప్రైజ్ మనీ డిటెయిల్స్ పంచుకున్నారు. ఈ సీజన్‌లో బిగ్‌బాస్ విజేత రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం గెలుచుకుంటాడని నాగ్ వెల్లడించాడు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని ఆయన ఇంటి సభ్యులను ఆదేశించాడు
ముందుగా ప్రియాంక.. యాభై లక్షలు అనే నెంబర్ ఎప్పుడూ చేత్తో కూడా పట్టుకోలేదని.. ఒకవేళ తాను ఆ డబ్బును గెలుచుకుంటే తల్లితండ్రులకు ఇల్లు కట్టించడంతో పాటు.. ఓ ఆడపిల్లను దత్తత తీసుకుంటానని వెల్లడించింది. శ్రీరామ్ - తన తల్లిదండ్రులకు ఒక పెద్ద ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. రవి మాట్లాడుతూ.. కొంత డబ్బుని కూతురు వియా చదువుకి ఖర్చు చేసి మిగిలిన డబ్బుతో టీవీ ప్రొడక్షన్ ను మొదలుపెట్టాలని ఉందని తన కోరికను తెలిపారు. కాజల్.. తనకు ముప్పై లక్షల అప్పు ఉందని.. ఆ డబ్బుతో అప్పు తీర్చేసి, ఓల్డేజ్ హోమ్ కట్టిస్తానని తెలిపింది. తనకు సెలూన్ పెట్టాలని కోరిక అని.. ఒకవేళ విన్నర్‌గా గెలిస్తే దానికి ఆ డబ్బును వాడతానని సన్నీ చెప్పాడు.
మానస్ మాట్లాడుతూ.. తనకు ప్రొడక్షన్ హౌస్‌ను మొదలుపెట్టాలని కోరిక అని, కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనుందని చెప్పాడు. షణ్ముఖ్ చెబుతూ.. పాతిక లక్షలు మా అమ్మకి, మరో పాతిక లక్షలు దీప్తికి ఇస్తానని వెల్లడించాడు. తన తల్లిదండ్రులు కొంతమంది ఎడ్యుకేషన్‌కి హెల్ప్ చేస్తున్నారని వారికి ఆ డబ్బు సాయపడుతుందని తెలిపాడు. సిరి మాట్లాడుతూ.. తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ పేరెంట్స్‌కి కొంత అప్పు ఉందని అది తీర్చేస్తానని.. మిగిలిన డబ్బుని అంధులకు హెల్ప్ చేయడానికి వాడతానని చెప్పింది.
అనంతరం నామినేషన్‌లో ఉన్నవారిని గార్డెన్ ఏరియాకు పిలిచిన నాగ్ నిలబడమని చెప్పారు.. అనంతరం షణ్ముఖ్ సేవ్ అయినట్లు ప్రకటించారు. తరువాత హౌస్‌మేట్స్‌తో 'చిట్టిబొమ్మలు చెప్పే చిత్రం' అనే గేమ్ ఆడించారు నాగార్జున. ఆపై నామినేషన్‌లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ చేతిలో బాక్సులు పెట్టగా... వాటిలో ప్రియాంక సేఫ్ అని వచ్చింది. చివరికి కాజల్, రవి మిగలడంతో వారిద్దరితో పాటు ఇంటి సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. ఈ సమయంలో కాజల్‌తో సన్నీ మాట్లాడుతూ.. 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' వాడతానని చెప్పాడు. దానికి కాజల్ బదులిస్తూ.. 'ఆడియన్స్ ఓటుతోనే వెళ్తాననంది. దీంతో ఆమెని ఒప్పించడానికి ప్రయత్నించారు సన్నీ, మానస్. నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని.. పాస్ అవసరం ఉండదని వాదించింది. నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావాలని ఎంతో ఫైట్ చేశావని.. తీస్కో అంటూ సన్నీ చెప్పాడు. అయినప్పటికీ కాజల్ మాత్రం ఆడియన్స్ ఓట్లతోనే ముందుకెళ్తానని పేర్కొంది.
అనంతరం రవి, కాజల్‌లను గార్డెన్ ఏరియాలోకి పిలిచారు నాగ్. ప్రేక్షకుల తీర్పు ఆల్రెడీ వచ్చేసిందని.. అయితే దానిని మార్చే పవర్.. ఇంటిలో ఒక్కరికే ఉందని చెప్పాడు. వెంటనే సన్నీ.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తీసుకుని వచ్చాడు. 'ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను నువ్ వాడుకుంటావా..? లేక వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేస్తావా అని నాగార్జున సన్నీని ప్రశ్నించారు. దానికి సన్నీ బదులిస్తూ... 'తనకు ఇద్దరూ ఇష్టమే' అని బదులిచ్చాడు. మధ్యలో షణ్ముఖ్ కల్పించుకుని ఆలోచించు' అంటూ డైలాగ్ వేశాడు.
ఇక కాసేపు మౌనం దాల్చిన సన్నీ.. అంతిమంగా కాజల్ ముందు ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెట్టేశాడు. అది తనకు కాజల్ వల్లనే వచ్చిందని , అందుకే ఆమెకే వాడానని సన్నీ రీజన్ చెప్పాడు. దీంతో నామినేషన్‌లో ఉన్న కాజల్ సేవ్ అవ్వగా రవి ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఎమోషనల్ అయిన సన్నీ వెళ్లి రవిని హగ్ చేసుకున్నాడు. నీకు పాస్ వాడలేకపోయినందుకు క్షమాపణలు చెబుతూ ఏడ్చేశాడు . అయతే తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్‌ను రవికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఘటనతో కాజల్ కూడా కంటతడి పెట్టింది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను బిగ్‌బాస్‌కి తిరిగిచ్చేయాలని నాగార్జున ఆదేశించారు. రవి హౌస్ వీడుతుండటంతో షణ్ముఖ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇంటి సభ్యులంతా ఆయనకు కన్నీటితో వీడ్కోలు చెప్పారు.
అనంతరం స్టేజ్ మీదకు వచ్చిన రవిని ఈ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే గేమ్ ఆడించారు నాగార్జున. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. షణ్ను పాస్ అయ్యాడని.. చాలా మెచ్యూర్డ్ అని, తనకొక బ్రదర్ దొరికాడని చెప్పాడు. ఇక శ్రీరామ్ లేట్ గా కనెక్ట్ అయినా.. బంధువుగా అయిపోయాడని అన్నాడు. ఫ్రెండ్ అంటే ఏదైనా చేసేస్తాడని.. సన్నీపై ప్రశంసలు కురిపించాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. 'చేతులు కాలకుండా కాపాడుకునే బాధ్యత నీది. ఏదైనా ఆలోచించి చేయి' అంటూ ప్రియాంకకు సలహా ఇచ్చాడు రవి. 'ఫెయిల్ అవుతాననే భయంతో గేమ్ ఆడకు' అని సిరికి సూచించాడు. అటు మానస్ చాలా బాగా గేమ్ ఆడుతున్నడని .. అతడిని చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యానంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. 'నువ్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదని' కాజల్‌కి చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments