వైసీపీకి మరో బిగ్ షాక్.. నరసరావుపేట ఎంపీ రాజీనామా..
- IndiaGlitz, [Tuesday,January 23 2024]
ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు(Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. . పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని పేర్కొన్నారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బీసీకి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందని.. సీటు విషయంలో నెలకొన్న అనిశ్చితికి తాను కారణం కాదన్నారు. ఏ పార్టీలో చేరే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
అయితే గత కొన్నిరోజులుగా ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారనే వదంతులు వ్యాపించాయి. ఇటీవల ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు. దీంతో పార్టీ మార్పు ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే దేవరాయలు మాత్రం ఈ వార్తలను ఖండించలేదు. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రచారానికి తెరదించారు. త్వరలోనే ఆయన పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.
కాగా ఇటీవల మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మరోవైపు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నియమితులైన మంత్రి జయరాం కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ చేరనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదే బాటలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్నికల వేళ అధికార పార్టీ నుంచి వలసలు పెరగడంతో క్యాడర్‌లో తీవ్ర అసహనం నెలకొంది.