ఎన్నికల ముందు టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి ఎమ్మెల్యే
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ బీఫామ్‌పై గెలిచినప్పటికీ సొంత పార్టీపైనే తిరుగుబాటు చేస్తూ.. కనీసం సీఎం చంద్రబాబు చెప్పినా మాట వినకుండా నా రూటు సపరేటు అని ఉంటూ వస్తున్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఎన్నోసార్లు బహిరంగంగా కూడా పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని.. సరైన గుర్తింపు ఇవ్వట్లేదని మోదుగుల చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అయితే మంగళవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గ నేతలతో టిడిపి ఎమ్మెల్యే మోదుగుల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరై పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ఈ సమావేశంతో ఆయన పార్టీ మారతారన్న పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న మోదుగుల ఎట్టకేలకు టీడీపీకి చెప్పేయాలని క్లారిటీకి వచ్చేశారు.
మంగళవారం ఉదయం సుధీర్ఘ సమావేశంలో టీడీపీలో తనకు జరిగిన అవమానాలను నేతలు, అనుచరులకు ఆయన వివరించారు. తనకు గౌరవం లేని చోట ఉండలేనని చెప్పిన మోదుగుల టీడీపీని వీడేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తాడేమో? అని ఎదురుచూశానని.. అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన ఆవేదనకు లోనయ్యారు. దీంతో తాను పార్టీ వీడాలని పార్టీ వీడుతున్నట్లు డివిజన్ అధ్యక్షులకు మోదుగుల తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా చివరి సారిగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన గ్రూపు ఫోటోలు దిగారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే గుంటూరు నుంచి తన అనుచరులు, ముఖ్య నేతలతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరారు.
ఉదయం భేటీ.. సాయంత్రం రాజీనామా..
ఉదయం అనుచరులు, డివిజన్ అధ్యక్షులతో భేటీ అయిన మోదుగుల సాయంత్రానికల్లా టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు పంపారు. "నా వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దయచేసి రాజీనామాను ఆమోదించగలరు" అని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు కూడా మోదుగుల రాజీనామా లేఖను పంపారు.
కాసేపట్లో జగన్‌తో భేటీ..
మంగళవారం సాయంత్రం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో మోదుగుల భేటీ కానున్నారు. నెల్లూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం’ సభలో పాల్గొనడానికి వెళ్లారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు చేరుకోనున్నారు. వైఎస్ జగన్‌తో భేటీ అయ్యి సీటు విషయమై చర్చిస్తారని.. అనంతరం వైసీపీ అధినేత సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. కాగా.. మోదుగుల వైసీపీలో చేరితే గుంటూరు లేదా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీచేస్తారని లేదంటే.. సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే సీటు విషయమై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout