Janasena: పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. వైసీపీలో చేరిన పిఠాపురం కీలక నేత..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల ముందు జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. అందులోనూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి బయటకు వెళ్తున్నారు. తాజాగా పిఠాపురంలో జనసేన కీలక నేతగా ఉన్న మాకినీడు శేషుకుమారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాడేపల్లిలోని సీఎం జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి, పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషుకుమారి పోటీచేసి ఓడిపోయారు.
కాగా వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఈసారి లక్ష మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఇటువంటి తరుణంలో కీలక నేతగా ఉన్న శేషుకుమారి జనసేనను వీడటం ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తుండటంతో జగన్.. స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇక్కడ ఎలాగైనా గెలవాలని సీనియర్ నేతలైన కన్నబాబు, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభంకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే జనసేన, టీడీపీలో ఉన్న అసంతృప్తి నేతలకు గాలం వేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. మరోవైపు రాధా-రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర కూడా సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. వంగవీటి కుటుంబానికి, రంగా అభిమానులకు.. టీడీపీ ఎప్పటికీ బద్ద శత్రువే అని తెలిపారు. కాపుల్లో మంచి పేరు ఉన్న వంగవీటి కుటుంబానికి చెందిన నరేంద్ర పార్టీలో చేరడం శుభపరిణామం అని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి పవన్ కల్యాణ్‌ను దెబ్బకొట్టేందుకు.. కాపు సామాజిక వర్గం ఓట్లు రాబట్టేందుకు కాపు కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కాపు ఓట్లు జనసేన-టీడీపీ-బీజేపీ కూటమికి మళ్లకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఎన్నికల్లో లాగా ఈసారి కూడా పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టాలని సీఎం జగన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మరి ఈ ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments