BRS:బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, ఆ పార్టీ సీనియర్ నేత తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీతో, సీఎం రేవంత్ రెడ్డిని కూడా రాజయ్య కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం సైతం రాజయ్య చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఈనెల 10న భారీ సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో రాజయ్య చేరనున్నారట. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకున్నా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నానని తెలిపారు. అయినా అధిష్ఠానం నుంచి మాత్రం స్పందన కరువైందని వాపోయారు. పార్టీకి ఎంతో సేవ చేసినా తనకు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ క్షోభకు గురయ్యానని.. పార్టీ అధినేతను కలిసే అవకాశం కూడా తనకు రాలేదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు ఆదరణ కరువైందని.. పార్టీ విధివిధానాలు తనకు నచ్చడం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ గులాబీ నేతలు అనడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు. అయితే చివరి నిమిషంలో మాజీ మంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న రాజయ్యకు పార్టీ పెద్దలు సర్దిచెప్పారు. ఎట్టకేలకు కేటీఆర్ సమక్షంలో కడియం శ్రీహరికి సహకరిస్తానని కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ క్రమంలో రాజయ్యను సముదాయించేందుకు.. రైతుబంధు సమితి ఛైర్మన్ పదవి ఇచ్చారు. కొంతకాలంగా మౌనంగా ఉన్న రాజయ్య పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. అయితే అధిష్టానం సుముఖంగా లేకపోవడంలో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.
రాజయ్య రాజీనామా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ అనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. పైకి నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిశామని చెబుతున్నా. పార్టీ మార్పునకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్స్ ఇచ్చినట్లే అని వాదనలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా వీరు పార్టీ మారే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించి కోలుకోలేని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ పెద్దలు కూడా పట్టుదలతో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments