BRS, Congress:తెలంగాణలో గులాబీ పార్టీకి షాక్ ఖాయం.. కాంగ్రెస్‌దే అధికారం అంటున్న లోక్‌పోల్ సర్వే
- IndiaGlitz, [Friday,October 06 2023]
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ సర్వే ఫలితాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లోక్ పోల్ సంస్థ విడుదల చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ముచ్చటగా మూడో సారి గెలిచి అధికారంలోకి వద్దామనుకుంటున్న కేసీఆర్‌కు ఈ సర్వే ఫలితాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మరో రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వేలో వెల్లడించింది. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవనుందని తెలిపింది. దీంతో గులాబీ శ్రేణుల్లో కలవరం మొదలైతే.. హస్తం కార్యకర్తల్లో జోష్ నెలకొంది.
కాంగ్రెస్‌కు 61-67 స్థానాలు.. బీఆర్ఎస్కు 45-51 స్థానాలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 30 వరకు సర్వే నిర్వహించామని లోక్ పోల్ సంస్థ వెల్లడించింది. 119 నియోజకవర్గాలకు గానూ కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. అలాగే అధికార బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 స్థానాలు మాత్రమే రావొచ్చని వెల్లడించింది. ఇక బీజేపీ కేవలం 2 నుంచి 3 సీట్లలో మాత్రంమే విజయం సాధిస్తుందని పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 6-8 స్థానాలు వచ్చే అవకాశముందని చెప్పింది. ఇతరులు 0-1 స్థానాలు గెలవొచ్చని వివరించింది. ఓట్ల షేర్ పరంగా చూస్తే హస్తం పార్టీకి 41-44శాతం.. గులాబీ పార్టీకి 39-42శాతం.. కమలం పార్టీకి 10-12శాతం ఓట్లు.. గాలిపటం పార్టీకి 3-4శాతం, ఇతరులకు 3-5 శాతం ఓట్లు వస్తాయని లోక్ పోల్ సర్వేలో వెల్లడైంది.
ప్రజలపై ప్రభావం చూపిస్తున్న కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలు..
గత నెలలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలు ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయని తెలిపింది. అలాగే బీసీలు, మైనారిటీల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోందని పేర్కొంది. స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తితో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో వైఫల్యం బీఆర్ఎస్పై వ్యతిరేకత చూపిస్తుందని పేర్కొంది. రైతులు, నిరుద్యోగుల్లో గులాబీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వివరించింది. ఇక బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వెళ్తుందని.. దీంతో బీజేపీ వైపు మొగ్గు చూపడలం లేదని చెప్పింది. ఎంఐఎం ఎప్పటిలాగానే పాతబస్తీలో తన ఓటు బ్యాంకును నిలుపుకుంటుందంది.
కర్ణాటకలో నిజమైన లోక్ పోల్ సర్వే సంస్థ ఫలితాలు..
కాగా గతంలో కర్ణాటక ఎన్నికల్లో లోకోపోల్ సర్వే ఫలితాలు దాదాపు అటు ఇటుగా నిజమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 129-134 స్థానాలు, బీజేపీకి 59-65 స్థానాలు, జేడీఎస్ 23-28 స్థానాలు గెలుచుకుంటాయని వెల్లడించింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు 124 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు తెలంగాణలో కూడా లోక్ పోల్ సర్వే నిజం కానుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే ఫలితాలు ఎంతవరకు నిజం అవుతాయో తెలియాలంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే.