YCP MLA Alla:బ్రేకింగ్: వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే ఆళ్ల రాజీనామా

  • IndiaGlitz, [Monday,December 11 2023]

ఎన్నికలకు ముందు వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభా కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు, రాజకీయాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి రూ. 1,250 కోట్ల నిధులను మంజురు చేస్తామని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు నిధులను విడుదల చేయలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల పోటాపోటీగా కార్యాలయాలు సైతం నిర్వహిస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి వేరే పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా.. వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం చర్చనీయాశంగా మారింది. ఇరు వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు పెరగడంతో చివరకు ఆయన పార్టీని వీడారు.

కాగా 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేయగా.. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. లోకేష్‌పై ఆళ్ల గెలిచి వార్తల్లో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక అప్పటి నుంచి అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. దీంతో రాజధాని పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేశారనే కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆమె బహిరంగంగానే టీడీపీకి మద్దతు ఇస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆళ్ల కూడా పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ వైసీపీ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.