Mahasena Rajesh:మహాసేన రాజేశ్‌కు భారీ షాక్.. పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే..

  • IndiaGlitz, [Saturday,March 23 2024]

పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలంలో నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలి. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసేనదే’ అని ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయి ఇంఛార్జ్ లేకపోయినా అక్కడి పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు ఒకే తాటి మీద నిలిచారు. పార్టీ విధివిధానాలను అనుసరించారు. ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఈ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దశదిశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అనంతరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు.

కాగా పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. తొలి జాబితాలో పి.గన్నవరం నియోజకవర్గం అభ్యర్థిగా సరిపెళ్ల రాజేశ్ అలియాస్ మహాసేన రాజేశ్‌ను చంద్రబాబు ప్రకటించారు. అయితే బ్రాహ్మణులు, హిందువులకు వ్యతిరేకంగా గతంలో రాజేశ్ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జనసేన నేతలతో పాటు టీడీపీలోని కొంతమంది నేతలు కూడా రాజేశ్‌కు టికెట్ వద్దని.. అతడి వల్ల మిగతా నియోజకవర్గాలలోనూ పార్టీకి దెబ్బ తగులుతుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

నిరసనలు ఎక్కువ కావటంతో రాజేశ్ క్షమాపణలు సైతం చెప్పారు. తన వల్ల పార్టీకి ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే పోటీ నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పి. గన్నవరం టికెట్‌ను జనసేనకు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన గిడ్డి సత్యనారాయణను పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించారు.