BRS:బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి, పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. అయితే ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ పార్టీకి గట్టి దెబ్బ అనే చెప్పాలి.
ప్రస్తుతం వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పోటీలో నిలపాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎంపీ సీటును కూడా గెలుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీగా గాలం వేసి సక్సెస్ అయ్యారు.
ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్యెల్యే తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకున్నా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నానని తెలిపారు. అయినా అధిష్ఠానం నుంచి మాత్రం స్పందన కరువైందని వాపోయారు. పార్టీకి ఎంతో సేవ చేసినా తనకు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ గులాబీ నేతలు అనడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఇలా వరుసగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కీలక నేతలందరూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments