Pinnelli: పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో మరోసారి భారీ ఊరట..
Send us your feedback to audioarticles@vaarta.com
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి భారీ ఊరట దక్కింది. ఆయనపై నమోదైన మరో మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది, అయితే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఉన్న బెయిల్ షరుతులే.. ఈ మూడు కేసుల విషయంలో కూడా వర్తిస్తాయని న్యాయమూర్తి తెలిపారు. తన పైన నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు.
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటులో పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదుకాగా.. ఆ కేసులో ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పాల్వాయిగేటు ఘటనలోనే పిన్నెల్లిని అడ్డుకోబోయినందుకు తనపై దాడి, హత్యాయత్నం చేశారని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పిన్నెల్లితోపాటు మరో 15 మందిపై ఐపీసీ 307(హత్యాయత్నం), మరికొన్ని సెక్షన్ల కింద మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అలాగే ఈవీఎంను ధ్వంసం బయటకొస్తుండగా.. చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ అడ్డుకుని ప్రశ్నించారు. అయితే తనను ఎమ్మెల్యే దూషించారని రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 506, 509, ఆర్‌పీ చట్టం సెక్షన్ 131 కింద ఇంకో కేసు నమోదైంది.
అంతేకాకుండా ఈ నెల 13న పోలింగ్ మరుసటిరోజు కారంపూండిలో పిన్నెల్లి అనుచరులు దాడులకు పాల్పడుతుంటే అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచారనే మరో ఫిర్యాదు అందింది. సీఐ ఫిర్యాదు చేయడంతో పిన్నెల్లితో పాటుగా ఆయన సోదరుడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ దక్కింది. మరోవైపు ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు వచ్చిన దగ్గరి నుంచి పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout