Chandrababu: బ్రేకింగ్: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట
- IndiaGlitz, [Wednesday,January 10 2024]
ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సీఐడీ తనపై నమోదైన చేసిన ఇన్నర్ రింగ్, మద్యం, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై సుదీర్ఘంగా విచారణ జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తాజాగా తుది ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో చంద్రబాబుకు భారీ ఊరట దక్కిందనే చెప్పాలి.
కాగా స్కిల్ డెవలెప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు చేశారు. అనంతరం సెప్టెంబర్ 10న విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 10 నుంచి 52 రోజులు పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది.
ఇదే క్రమంలో ఆయనపై సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక అక్రమాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటిషన్పై విచారణ జరగ్గా.. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఇప్పటికే పూర్తి కాగా.. సర్వోన్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.