Chandrababu: ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట
- IndiaGlitz, [Monday,January 29 2024]
టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వం పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో 2022లోనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని.. సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని స్పష్టంచేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు లిక్కర్, ఇసుక కేసుల్లో సీఐడీ తనపై నమోదైన చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై సుదీర్ఘంగా విచారణ జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈనెల 10న ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల వేళ చంద్రబాబుకు భారీ ఊరట లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కాగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు చేశారు. అనంతరం సెప్టెంబర్ 10న విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 10 నుంచి 52 రోజులు పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ తీర్పును రెగ్యులర్ చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఇదే క్రమంలో ఆయనపై సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక అక్రమాలపై కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించిన విషయం విధితమే. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబుకు అనుకూలంగా 17ఏ సెక్షన్ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా.. 17ఏ వర్తించదని జస్టిస్ త్రివేది తెలియజేశారు. దీంతో తమకు దీనిపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని.. దీంతో తుది నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు నివేదిస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవితవ్యం సీజేఐ చేతుల్లోకి వెళ్లింది. మరి సీజేఐ బెంచ్ ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే ఉత్కంఠ నెలకొంది.