AP Schemes: ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. పథకాల నిధుల విడుదలకు హైకోర్టు అనుమతి
- IndiaGlitz, [Friday,May 10 2024]
ఏపీ ఎన్నికల వేళ చర్చనీయాంశమైన సంక్షేమ పథకాల నిధుల విడుదలపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా నిపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈనెల 11 నుంచి 13వరకు నిధుల విడుదల చేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. అయితే శుక్రవారం ఒక్కరోజు మాత్రమే పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు, ప్రచారం వద్దని.. నేతలు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది.
వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, చేయూత, తుపాన్ పంట నష్టపరిహారంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.14వేల కోట్లకుపైగా వేయాల్సి ఉందని ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వ సీఎస్ అనుమతి కోరారు. అయితే పోలింగ్ ముందు నిధులు విడుదల చేస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని.. పోలింగ్ తర్వాత రోజు నుంచి నిధులు జమ చేసుకోవచ్చని ఈసీ స్పష్టంచేసింది. దీనిపై కొందరు వైసీపీ సానుభూతిపరులు హైకోర్టుకు వెళ్లారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఐదు గంటల పాటు ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి.
నిధులు విడుదల పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించారు. మే 13న పోలింగ్ ఉన్నందున పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే సమప్రాధాన్యత ఇచ్చినట్టు కాదని పేర్కొన్నారు. జనవరి నుంచి మార్చి 16 వరకు ఇవ్వాల్సిన పథకాల నిధులు ఇప్పటివరకు జమచేయకుండా కావాలనే జాప్యం చేశారని వాదించారు. అయితే ఈసీ వాదనలపై పిటిషనర్ల తరఫు లాయర్లు స్పందిస్తూ ఇవి కొత్త పథకాలు కావని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. ఇప్పుడు ఇవ్వకుంటే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వెల్లడించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయాలని సూచించింది. దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయడం, ప్రచారం చేయడం వద్దని ఆదేశించింది. అలాగే ఇందులో నేతల జోక్యం లేకుండా పంపిణీ జరగాలని తేల్చి చెప్పింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది.