ప్లాస్మా డోనర్ పేరుతో బడా మోసం.. 200 మంది నుంచి డబ్బు వసూలు..
- IndiaGlitz, [Tuesday,July 21 2020]
కరోనా కారణంగా చావుకి దగ్గరైన వ్యక్తులను బతికించేందుకు చిట్టచివరి ఆయుధంగా వైద్యులు ప్లాస్మాను ప్రయోగిస్తున్నారు. దానిలో కూడా మోసానికి తెగబడుతున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో కొందరు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడట్లేదు. ప్లాస్మా దానం చేసి.. త్వరగా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయిన ఓ వ్యక్తి అమాయక ప్రజలకు గాలం వేసి అడ్డంగా దొరికిపోయాడు. శ్రీకాకుళంలోని రాజమ్‌కు చెందిన సందీప్ రెడ్డి(25).. వ్యక్తుల ప్లాస్మాకు భారీ డిమాండ్ ఉందని తెలుసుకుని బడా మోసానికి తెరదీశాడు.
సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్(ఈస్ట్ జోన్) బృందం అతడిని సోమవారం అరెస్ట్ చేసింది. సందీప్‌పై పంజాగుట్ట, రామ్‌గోపాల్‌పేట్, బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అదనపు డీసీపీ(టాస్క్‌ఫోర్స్) జి. చక్రవర్తి తెలియజేశారు. అంతకుముందు రెండు దొంగతనం కేసులకు సంబంధించి అతన్ని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ప్లాస్మాకు భారీ డిమాండ్ ఉందని తెలుసుకుని హైదరాబాద్ వేదికగా ఈ తరహా మోసానికి సందీప్ పాల్పడ్డాడని చక్రవర్తి వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా రెడ్డి సందీప్ ప్లాస్మా కోసం వెదుకుతున్న వ్యక్తుల సమాచారాన్ని తెలుసుకున్నట్టు చక్రవర్తి తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిగా సందీప్ నటిస్తూ.. రోగుల కుటుంబ సభ్యులను కలిసి వారి అవసరానికి అనుగుణంగా ప్లాస్మాను దానం చేయాలని భావిస్తున్నట్టు వారిని నమ్మించేవాడు. తన ఖర్చుల కోసం కొంత డబ్బు పంపమని కోరేవాడు. డబ్బు పంపించిన అనంతరమే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేవాడని చక్రవర్తి తెలిపారు. మరికొందరిని కరోనాకు యాంటీ వైరల్‌గా ఉపయోగించే టోసిలిజుమాబ్ 400 ఎంజీ ఔషధాన్ని ఏర్పాటు చేస్తానంటూ నమ్మించాడని తెలిపారు. సందీప్ వలలో చిక్కి ఇప్పటి వరకూ 200 మందికి పైగా ప్రజలు మోసపోయారని చక్రవర్తి వెల్లడించారు. ఇటువంటి మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని డీసీపీ తెలిపారు.