బిగ్ బ్రేకింగ్: మే-3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
- IndiaGlitz, [Tuesday,April 14 2020]
యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై భారత యుద్ధం బలంగా సాగుతోందన్నారు. కష్టమైనా.. నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. దేశం కోసం తమ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నారన్నారు. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుందన్నారు. 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం సమర్థంగా అమలు చేసిందని మెచ్చుకున్నారు. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు.
ప్రజల సహకారంతోనే..
ప్రజల సహకారంతో కరోనాను నియంత్రిస్తున్నామని.. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని మోదీ కొనియాడారు. లాక్‌డౌన్ సంతృప్తికరంగా అమలవుతోందని.. ఇది ప్రజల విజయమని మోదీ కితాబిచ్చారు. కరోనాను తరమడం కోసం ప్రజలు త్యాగాలు చేస్తున్నారన్నారు. ‘రాజ్యాంగంలో వుయ్ ద పీపుల్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్ణ నిదర్శనంగా నిలుస్తున్నారు. అంబేద్కర్ చెప్పిన మాటలు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయి. ప్రజలు ఏకతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నివాళి. లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉండగానే అనేక పండగలు జరుపుకున్నాం’ అని మోదీ తెలిపారు.
ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధానికి పలు రాష్ట్రాల సీఎంలు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ఈ నెల 30 వరకు తెలంగాణ, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగించడం జరిగింది. కాగా.. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కేసులు 10వేలు దాటాయి. భారత్‌లో 10,363కి చేరిన కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,211 కొత్త కేసులు నమోదవ్వగా.. 31 మరణాలు సంభవించాయి. 8,988 కరోనా బాధితులకు చికిత్స కొనసాగుతున్నది. కరోనా నుంచి 1035 మంది కోలుకున్నారు. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకూ 339 మంది మృతి చెందారు.