'బిచ్చగాడు' సక్సెస్ కు కంటెంటే కారణం - చిత్ర నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన చిత్రం 'పిచ్చైకారన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో మే 13న విడుదల చేశారు. రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో 50 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో...
చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ ``తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాగా భావించి చూశారు. ఈ బిచ్చగాడు సినిమాతో నన్ను బిలియనీర్‌ను చేసినందుకు అందరికీ థాంక్స్`` అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ``ఈ సినిమాను తెలుగులో చేయాలనుకుని ముందు పిచ్చైకారన్ ట్రైలర్‌ను చూశాను. దీన్ని డబ్బింగ్ చేయడం కంటే రీమిక్స్ చేస్తేనే బావుంటుందని అన్నారు. మరసారి సినిమాను చూసి డబ్బింగ్ చేయాలనే నిర్ణయించుకున్నాను. బిచ్చగాడు అనే టైటిల్‌ను విజయ్ ఆంటోనితో మాట్లాడే పెట్టాం. అయితే విడుదల రోజున కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇదేం టైటిల్ సార్ అని కనీసం పోస్టర్స్ కూడా వేయలేదు. కంటెంట్ పై నమ్మకంతో సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాను. మంచి సినిమాలను తెలుగు ప్రజలకు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది. తెలుగులో కూడా ఇలాంటి మంచి చిత్రాలను నిర్మించాలి. నేను, కృష్ణారెడ్డిగారికి చెప్పేదొక్కటే మార్కెట్ లేని హీరోలతో ఇలాంటి మంచి చిత్రాలను తీస్తే ఎందుకు సక్సెస్ కాదో చూద్దాం`` అన్నారు.
నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ `` సినిమా అదృష్టం వల్ల ఇంత పెద్ద సక్సెస్ సాధించిందని కొంత మంది అన్నారు. అయితే వారి అభిప్రాయం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా సినిమాతో పాటు ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి కదా, మరి అవి సక్సెస్ కాలేదెందుకని, ఎందుకంటే మా సినిమాలో బలమైన కంటెంటే అందుకు కారణం. సినిమాను పెద్ద సక్సెస్ చేసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు థాంక్స్`` అన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ``బిచ్చగాడు సినిమాను నేను తీసిన యమలీల అనే సినిమాతో పోల్చుతున్నారు. అందుకు కారణం సినిమాలోని మదర్ సెంటిమెంట్. ఓ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంటే అది పెద్ద సక్సెస్ అవుతుంది. నిర్మాతలు చదలవాడ ఫ్యామిలీకి ఇది గొప్ప చిత్రం. వారు పక్కా ప్రమోషన్స్ తో సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటీని కలిగించారు`` అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ ``విజయ్ ఆంటోని, దర్శకుడు శశి యూనిట్ అందరికీ అభినందనలు. టైటిల్, క్యాప్షన్ బావుంది. విజయ్ ఆంటోని ఇలాంటి సినిమాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. సినిమా 50 రోజులే కాదు 100రోజుల వేడుకను కూడా జరుపుకోవాలి`` అన్నారు.
కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ``ఇప్పుడు సినిమాలంటే రెండు వారాలు మాత్రమే అని అనుకుంటున్నారు. కానీ సినిమా బావుంటే కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ఈ `బిచ్చగాడు` చిత్రం నిరూపించింది`` అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``బిచ్చగాడు ఓ చరిత్ర. కంటెంట్ ఉన్న సినిమా ఎక్కడైనా ఆడుతుందని నిరూపించింది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. చదలవాడ తాను దమ్మున్న నిర్మాతనని మరోసారి నిరూపించారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ ``చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. తెలుగులో ఇంత పెద్ద సక్సెస్ కావడం నేను నమ్మలేకపోతున్నాను. ఇందుకు ముఖ్యంగా ఆరుగురు కారణం. అందులో మొదటి వ్యక్తి దర్శకుడు శశి, ఈయన బిచ్చగాడు వంటి సినిమాతో మరో మంచి గుర్తింపునిచ్చాడు. రెండో వ్యక్తి నా శ్రీమతి ఫాతిమా. మూడో వ్యక్తి చదలవాడశ్రీనివాసరావుగారు, కథను నమ్మి సినిమాను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. భాషాశ్రీ సినిమాకు అద్భుతమైన డైలాగ్స్‌ను అందించారు. ఐదోది మీడియా, మంచి సినిమాకు అద్భుతమైన సపోర్ట్‌ను అందించారు. చివరగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ధన్యవాలు`` అన్నారు.
జయసుధ మాట్లాడుతూ ``విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి మాకు చెన్నైలో పరిచయం. ఇప్పుడు హీరోగా కూడా పెద్ద సక్సెస్‌ను అందుకున్నాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో ఇంత పెద్ద సక్సెస్ అవుతుందనుకోలేదు. ఇలాంటి సినిమాలో నేను మదర్ క్యారెక్టర్ చేయలేకపోయానే అనుకున్నాను. ఈ సినిమా 50 వేడుకే కాదు 100రోజుల వేడుకను జరుపుకోవాలి`` అన్నారు.
దర్శకుడు శశి మాట్లాడుతూ ``సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల రూపంలో చెప్పలేకపోతున్నాను. ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చిన విజయ్ ఆంటోని, నిర్మాతలు, ఫాతిమా ఆంటోని, తెలుగు నిర్మాతలైన చదలవాడ ఫ్యామిళీకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు`` అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యన్ రాజేష్, చేతన్ ఆనంద్, సత్న టైటస్ శివబాలాజీ, అల్లాణి శ్రీధర్ తదితరులు పాల్గొని యూనిట్‌ను అభినందించారు. యూనిట్ సభ్యులకు 50రోజుల షీల్డ్స్‌ను అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments