TTD : విధేయతకు పట్టం.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,August 05 2023]

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తారు. భూమన గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా వున్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు విధులు నిర్వర్తించారు. 2012 ఉపఎన్నికల్లో , 2019 ఏపీ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలంలో ఇవాళ్టీతో ముగియనుంది. దీంతో కొత్త ఛైర్మన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. తనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించిన సీఎం వైఎస్ జగన్‌కు భూమన కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

భూమన వైపే మొగ్గుచూపిన జగన్ :

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఛైర్మన్‌గా అవకాశం కల్పిస్తూ వచ్చారు. అయితే ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం భావించారు. దీంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు సీఎం వద్ద లాబీయింగ్ చేశారు. అయితే వివాదరహితుడిగా, సమర్ధుడిగా పేరున్న భూమన కరుణాకర్ రెడ్డి వైపే ముఖ్యమంత్రి మొగ్గుచూపారు. వైసీపీ అధికారంలోకి రాగానే భూమనకు మంత్రి పదవి గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ రెండు పర్యాయాలు ఆయనకు నిరాశే ఎదురైంది. అయినప్పటికీ భూమన తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పార్టీకి విధేయుడిగా వుంటూ వచ్చిన కరుణాకర్ రెడ్డికే జగన్ పట్టం కట్టారు.

వైఎస్‌కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న భూమన:

ఇకపోతే.. వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లె కరుణాకర్ రెడ్డి స్వగ్రామం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బీఏ, ఎంఏ చదివారు. కాంగ్రెస్ కార్యకర్తగా చురుగ్గా పనిచేసిన భూమన.. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. 2019లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.