మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు?: భూమా మౌనిక

  • IndiaGlitz, [Friday,January 08 2021]

మాజీ మంత్రి అఖిల ప్రియ కిడ్నాప్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అఖిల ప్రియ సోదరి మౌనిక మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిలప్రియను రహస్యంగా తీసుకెళ్లారని.. సరిగా భోజనం కూడా చేయడం లేదని మౌనిక తెలిపారు. తన సోదరి అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ వేధిస్తున్నారని.. జైల్లో ఉగ్రవాది కంటే దారుణంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి ఏవీ సుబ్బారెడ్డిని ఏ1 నుంచి ఏ2కి మార్చారన్నారు.

అఖిల ప్రియ అనారోగ్యంతో ఉందని.. తనకు అసలు వైద్యం కూడా అందించడం లేదని మౌనిక వెల్లడించారు. ఆమెను చూడటానికి వెళితే ఆమె కళ్లు తిరిగి పడిపోయే స్థితిలో ఉందని తెలిపారు. భూవివాదం తమ తండ్రి బతికున్నప్పటి నుంచి ఉందని తెలిపింది. తమ తల్లిదండ్రులు ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదన్నారు. తన తల్లి శోభా నాగిరెడ్డి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రస్తుతం తాము భూవివాదంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని మౌనిక వెల్లడించారు. ఎలాంటి వివాదమైనా కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుందన్నారు. తమను ఎందుకు టార్చర్ చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులే కేసును నిర్ధారిస్తే కోర్టులు ఎందుకని ఆమె ప్రశ్నించారు.

ఏ ఆధారాలతో అఖిలప్రియను అరెస్ట్‌ చేశారని మౌనిక ప్రశ్నించారు. ఆళ్లగడ్డ నుంచి వస్తే తాము ఏమైనా అంటరాని వాళ్లమా? అని నిలదీశారు. ఏవీ సుబ్బారెడ్డి రాత్రికి రాత్రి బయటకు రావడంపై ఏదైనా చీకటి ఒప్పందం కుదిరిందా.. అందుకే వేధిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ నుంచి వస్తే ఫ్యాక్షన్ వ్యక్తులుగా.. సంస్కారం లేని వాళ్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. అందరికి ప్రాథమిక హక్కులు ఉంటాయని అవి తన సోదరికి వర్తించవా? అని మౌనిక ప్రశ్నించారు. ఇవాళ కోర్టులో వాదనలు వినిపించే సమయంలో.. ఒక్క ఆధారం కూడా న్యాయమూర్తి ముందు ఉంచలేకపోయారన్నారు. ఆ భూమి ఒక వ్యక్తిది కాదని.. సంస్థదని.. దానికి చాలా మంది పార్ట్‌నర్స్‌ ఉన్నారని మౌనిక తెలిపారు.