'భీష్మ' సక్సెస్ గ్యారంటీ..! - ప్రి రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు.
ఈ వేడుకలో ముందుగా చిత్రంలోని 'సింగిల్ యాంథం' గీత రచయిత శ్రీమణి మాట్లాడుతూ, "అందరు సింగిల్స్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్సే ఈ పాటలో రాశాను. నితిన్‌కు లాస్ట్ బ్యాచిలర్ సాంగ్ నేనే రాశాను. ఆయనకు కంగ్రాట్స్. సింగిల్ గా నాలోని ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ అంతా పాటలో చూపించాను. ఈ మధ్య కాలంలో నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. 'జులాయి'తో నాకు బ్రేక్ ఇచ్చింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్. అప్పట్నుంచీ నాగవంశీ గారితో ట్రావెల్ చేస్తూనే వస్తున్నా" అని చెప్పారు.
మరో గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, "వెంకీ కుడుముల మొదటి సినిమా 'ఛలో'లో రెండు పాటలు రాశాను. ఆ రెండూ మంచి పేరు తీసుకొచ్చాయి. 'భీష్మ'లో 'వాటే వాటే బ్యూటీ' పాట రాశాను. మణిశర్మ గారబ్బాయి మహతి సాగర్ ఈ పాటను నాచేత బాగా రాయించుకున్నారు. ఈ పాట అందర్నీ ఆకట్టుకున్నందుకు సంతోషంగా ఉంది" అన్నారు.
'తొలిప్రేమ' డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "వెంకీ కుడుముల, నేను దాదాపు ఒకేసారి ఎంట్రీ ఇచ్చాం. ఆయన 'ఛలో', నా 'తొలిప్రేమ' రెండూ మంచి విజయం సాధించాయి. అప్పట్నుంచీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇదే బ్యానర్లో నితిన్ తో 'రంగ్ దే' చేస్తున్నా. నితిన్ ఒక ఇంటివాడు కాబోతున్నందుకు కంగ్రాట్స్. 'భీష్మ'తో వెంకీ పెద్ద హిట్టు కొట్టబోతున్నాడు" అన్నారు.
మంచి ఫీల్ గుడ్ మూవీ!
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ, "ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ బ్యానర్లో తీసే ప్రతి సినిమాలో నాకో మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. వెంకీ కుడుముల ఈ సినిమాతో బాగా కుదిపేస్తాడని అనుకుంటున్నా. డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సీన్లు చూశాను. మంచి ఫీల్ గుడ్ మూవీ. నితిన్ ను మంచి కమర్షియల్ హీరోగా ఈ సినిమాలో చూడబోతున్నారు. రష్మిక బ్యూటిఫుల్ గాళ్. ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. త్రివిక్రమ్ తర్వాత నన్ను ఎక్కువగా నవ్వించింది వెంకీ కుడుముల. 'భీష్మ' కచ్చితంగా హిట్టవుతుంది" అని చెప్పారు.
నితిన్ డాన్సులు ఇరగదీశాడు!
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "వెంకీ తీసిన 'ఛలో' చూసినప్పుడే అతని ఎంటర్టైన్మెంట్ స్కిల్, అతని విజన్ అర్థమైంది. 'శ్రీనివాస కల్యాణం' చేసేటప్పుడు నితిన్ ఈ కథ చెప్పాడు. అప్పుడే కచ్చితంగా ఒక మంచి సినిమా తీస్తారని అర్థమైంది. మొన్న సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నితిన్ డాన్సులు ఇరగదీశాడు. సినిమా అంతా నితిన్ ను రష్మిక ఆడుకుంటూనే ఉంది. స్వరసాగర్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం. అన్ని పాటలూ బాగున్నాయ్. అతను మణిశర్మగారి పేరు నిలబెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్. 'అల.. వైకుంఠపురములో' ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలుసు. ఆ సినిమాతో పోటీపడేలా ఈ సినిమాలో విజువల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 21న వస్తున్న ఈ సినిమా డెఫినెట్ గా హిట్టవుతుంది" అని చెప్పారు.
నితిన్, రష్మిక కెమిస్ట్రీ అమేజింగ్!
సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ మాట్లాడుతూ, "నిర్మాతలు రాధాకృష్ణ గారు, వంశీగారు ఇచ్చిన గ్రేట్ సపోర్టుకు చాలా థాంక్స్. నితిన్ అమేజింగ్. ఆయనకు ఊపొస్తే తట్టుకోలేం. అంత బాగా యాక్ట్ చేశారు, డాన్సులు చేశారు. వేరే లెవల్లో ఆయన చేశారు. నాకు కూడా అది చూసి మరింత ఉత్సాహం వచ్చింది. వెంకీ కుడుముల లేకపోతే నేనిక్కడ ఉండేవాడ్ని కాదు. స్క్రీన్ పై రష్మిక అద్భుతంగా ఉంది. నితిన్, రష్మిక కెమిస్ట్రీ అమేజింగ్" అన్నారు.
ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చెయ్యం
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, "త్రివిక్రమ్ గారికి నేను భక్తుడ్ని. ఆయన దగ్గర ఎప్పట్నుంచే పనిచేద్దామని అనుకుంటున్నప్పుడు 'అ ఆ' సినిమాకు ఆయన దగ్గర నన్ను చేర్పించింది నిర్మాత చినబాబు గారే. వాళ్లిద్దరికీ థాంక్స్. ఈ సినిమా కథకు సమయం పట్టింది. అందువల్లే నితిన్ ఫ్యాన్స్ ను వెయిట్ చేయించాల్సి వచ్చింది. అయితే వెయిట్ చేసినందుకు సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాపై నేను చాలా నమ్మకంగా ఉన్నాను. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ మంచి విజువల్స్ ఇచ్చారు. పాటలకు సాగర్ ఎంత మంచి బాణీలిచ్చాడో, రీరికార్డింగ్ కూడా అంత అసాధారణంగా ఇచ్చాడు. రష్మిక ఈ సినిమా కథ వినగానే ఓకే అని చేసినందుకు థాంక్స్. ప్రేక్షకుల్ని మేం డిజప్పాయింట్ చెయ్యం" అని చెప్పారు.
నిర్మాతలకు 'భీష్మ'తో భారీ లాభాలు రావాలి!
హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ, "ఈ తరంలో నిజమైన ఫ్రెండ్స్ ఉండటం చాలా కష్టమైపోతోంది. కానీ ఈ సినిమాకి పనిచేసేటప్పుడు నేను జెన్యూన్ పీపుల్ ని కలిశాను. వెంకీ కుడుముల అలాంటి వ్యక్తి. ఈరోజు టాలీవుడ్ లో నేనిక్కడ ఉన్నానంటే ఒక ప్రధాన కారణం ఆయనే. 'భీష్మ' స్క్రిప్టును ఆర్గానిక్ వ్యవసాయం నేపథ్యంతో ఆయన రాసుకున్నారు. ఈ సినిమాని ఆయన తీస్తున్న విధానం చూసి నేను సరెండర్ అయిపోయా. పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆయనకు జీవితాంతం ఒక మంచి ఫ్రెండుగా ఉంటాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు 'అ ఆ' చూశాను. నేను సినిమాలు చేస్తే, ఇలాంటి సినిమా చెయ్యాలని అప్పుడే అనుకున్నా. ఇప్పుడు అదే నితిన్ తో 'భీష్మ' చేశాను. తెర బయట ఆయన ఒక జెన్యూన్ పర్సన్. ఆయనను బెస్ట్ కో-స్టార్ అని చెప్పను, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను. సందర్భానికి తగ్గట్లు సాగర్ మంచి సాంగ్స్ ఇచ్చారు. టాలీవుడ్ లో నాకు మొదట 'చూసీ చూడంగానే' అనే బిగ్గెస్ట్ సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ 'వాటే బ్యూటీ', 'సరాసరి' పాటలతో పాటు సింగిల్స్ యాంథం ఇచ్చారు. రీరికార్డింగ్ సూపర్బ్ అని వింటున్నా. ప్రేక్షకులతో పాటు నేనూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు రావాలని కోరుకుంటున్నా. టాలీవుడ్ లో నేను చూసిన మంచి సినిమాల్లో 'అ ఆ' ఒకటి. నన్ను కూడా ఆయన సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా" అని చెప్పారు.
'దిల్', 'సై' తర్వాత 'భీష్మ'!
హీరో నితిన్ మాట్లాడుతూ, "నా మునుపటి సినిమాకూ, ఈ సినిమాకూ దాదాపు ఒక సంవత్సరం గ్యాప్ ఉంది. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయ్యేవరకు సినిమా మొదలుపెట్టకూడని అనుకున్నాను. వెంకీ ఫుల్ స్క్రిప్ట్ చెప్పేవరకు ఆగి అప్పుడు మొదలుపెట్టాం. ఫిబ్రవరి 21న సినిమా వస్తోంది. వెంకీ 'దిల్' సినిమాకు, నాకూ పెద్ద అభిమాని అంట. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి, 'దిల్', 'సై' తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు. నా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ 'డ్యాన్సన్నా.. డ్యాన్సన్నా' అని అడుగుతున్నారు. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్స్ చూసి అభిమానుల ఆకలి తీరుతుందని అనుకుంటున్నా. కానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నా బెండు తీసేశాడు. శేఖర్ మాస్టర్ కూడా బాగా చేయించారు. సెకండాఫ్ లో వచ్చే ఫైట్ ను ఫైట్ మాస్టర్ వెంకట్ అదరకొట్టేశారు. ఆ ఫైట్ లో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ. ఆ ఫైట్ కు స్వరసాగర్ ఇచ్చిన రీరికార్డింగ్ ఫోన్ లో చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు లైఫ్ లాగా నిలిచే సాంగ్స్ ఇచ్చాడు. భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడిగా తను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. కాసర్ల శ్యాం, శ్రీమణి, కృష్ణచైతన్య చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. నవీన్ నూలి బాగా ఎడిటింగ్ చేశాడు.
నన్నూ, రష్మికను సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ చాలా అందంగా చూపించారు. నాకు బ్యూటీ టిప్స్ ఇచ్చేది బ్రహ్మాజీ గారైతే, రష్మిక ఇంత ఫిట్ గా, ఇంత బ్యూటీగా ఉండటానికి కారణం తను తీసుకొనే ఆహారం. అది సీక్రెట్. తను మంచి నటి. అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో 'వాటే బ్యూటీ' సాంగ్ లో తను చేసిన డ్యాన్స్ చూసి షాకయ్యా. చాలా బాగా చేసింది. హార్డ్ వర్క్, డెడికేషన్ తో ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది. నాకు మంచి ఫ్రెండయ్యింది. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట 'అ ఆ' చేసి, ఇప్పుడు ఈ సినిమా చేశాను. మూడో సినిమా 'రంగ్ దే' ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్ గీస్తున్నారు. నా లైఫ్ లో పంచ ప్రాణాలు.. మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నాకాబోయే భార్య ఆరో ప్రాణం కాబోతోంది. త్రివిక్రమ్ గారితో పరిచయం కావడం, 'అ ఆ' సినిమా చెయ్యడం, నా జీవితంలో ఆయన ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకాల ఉంటే నా ధైర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మార్గదర్శకుడు. ఇక పవన్ కల్యాణ్ గారి గురించి చెప్పేదేముంది. ఆయన మేలో మనముందుకు రాబోతున్నారు. అందరం అప్పుడు చొక్కాలు చింపుకొని సినిమా చూద్దాం" అని చెప్పారు.
'భీష్మ' సక్సెస్ గ్యారంటీ- సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్
మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, "నితిన్ కు వాళ్లన్నయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులెప్పుడూ ఉంటాయ్. ఆయన తరపునా, ఆయన అభిమానులందరి తరపునా నితిన్ కు ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ వెంకీ కుడుముల, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ మహతి.. మిగతా అందరికీ అభినందనలు చెబుతున్నా. ఇప్పటికే నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. 21న అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా. రష్మిక 'సరిలేరు నీకెవ్వరు'తో మంచి సక్సెస్ మార్గంలో ఉంది. ఇప్పుడు 'భీష్మ' వస్తోంది. ఆమెకు మరిన్ని విజయాలు రావాలి. బెంగళూరు నుంచి 50 నిమిషాలే ప్రయాణం కాబట్టి ఆమె వర్రీ అవ్వాల్సిన పనిలేదు. మీరెప్పుడూ మాకు బాగా దగ్గరిగానే ఉంటారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్ లో రెండున్నాయి. ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్. చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు. రెండు.. జానీ మాస్టర్ చేసిన లాస్ట్ సాంగ్ 'వాటే బ్యూటీ'. మా 'బుట్టబొమ్మ' సాంగ్ ఎంత బాగా చేశాడో, దాన్ని అంత బాగా చేశాడు. 'జెర్సీ' తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నారు. మంచి సక్సెస్ తో 2020లోకి అడుగుపెట్టబోతున్నారు. 21 సాయంత్రం పెద్ద పార్టీ ఇవ్వాలని, దానికి నన్ను పిలవడం మర్చిపోవద్దని కోరుకుంటున్నా" అని చెప్పారు.
ఈ వేడుకలో నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్ వెంకట్, సుచిర్ ఇండియా కిరణ్, గ్రీన్ మెట్రో ప్రతినిధులు అశోక్, ఆదిత్య, బాలనటుడు రాకేష్ కూడా చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments