Download App

Bheeshma Review

ఒక‌టి కాదు.. రెండు కాదు మూడు ప్లాపులు ఎదురు కావ‌డంతో హీరో నితిన్ కాస్త డీలా ప‌డ్డాడు. కాస్త గ్యాప్ తీసుకుని స్క్రిప్ట్ అంతా న‌చ్చిన త‌ర్వాత ట్రాక్ ఎక్కించిన సినిమా `భీష్మ‌`. ఏదో స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌ని కాకుండా..`ఛ‌లో` వంటి సినిమాతో స‌క్సెస్ అందుకున్న ఓ సినిమా డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌తో నితిన్ చేతులు క‌లిపాడు. క్షేత్రీయ వ్య‌వ‌సాయం అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని కామెడీని జ‌త క‌లిపి తెర‌కెక్కించిన `భీష్మ` మ‌రి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా?  ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుల‌కు రెండో సినిమా స‌రిగ్గా ఆడ‌దు అనే సెంటిమెంట్‌ను వెంకీ కుడుముల ఈ సినిమాతో దాటాడా? మ‌ంచి హిట్ కావాల్సిన త‌రుణంలో నితిన్ అనుకున్నట్లు హిట్ కొట్ట‌డా? అనే విష‌యాలు తెలియాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

క్షేత్ర వ్య‌వ‌సాయ కంపెనీతో రైతుల‌ను ఉత్తేజ ప‌రుస్తూ భావిత‌రాల‌కు మంచి ఆహారాన్ని అందించాల‌నుకుని భీష్మ అనే ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీని స్టార్ట్ చేస్తాడు భీష్మ‌(అనంత్ నాగ్‌). ఆర్గానిక్ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో కెమిక‌ల్ వ్య‌వ‌సాయి ఉత్ప‌త్తుల‌కు గిరాకీ త‌గ్గిపోతూ ఉంటుంది. కెమిక‌ల్స్‌తో వ్య‌వ‌సాయం చేయాల‌నుకునే వ్య‌క్తి రాఘ‌వ‌న్‌(జిస్సు సేన్ గుప్తా), భీష్మీను దెబ్బ తీయాల‌నుకుంటూ ఉంటాడు. త‌క్కువ కాలంలోనే పంట చేతికొచ్చే ఓ ప్రొడ‌క్ట్‌ను త‌యారు చేస్తాడు. అదే స‌మ‌యంలో భీష్మ త‌న కంపెనీకి వార‌సుడిని ప్ర‌క‌టించాల‌ని అనుకుంటూ ఉంటాడు. అదే స‌మ‌యంలో కుర్ర‌వాడు, డిగ్రీ త‌ప్పిన‌వాడైన‌ భీష్మ‌(నితిన్‌) గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను వెతుక్కునే ప‌నిలో ఉంటాడు. అనుకోకుండా అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్ దేవా(సంప‌త్) కుమార్తె ఛైత్ర‌ను క‌ల‌వ‌డం..తన మాట‌లు, చేత‌ల‌తో ఆమె ప్రేమ‌ను గెలుచుకుంటాడు. నాట‌కీయ ప‌రిస్థితుల మ‌ధ్య అనుకోకుండా జూనియ‌ర్ భీష్మ‌ను త‌న కంపెనీకి సీఈవోగా నియ‌మిస్తాడు సీనియ‌ర్ భీష్మ‌. నెల‌రోజుల పాటు వ‌ర్కింగ్ సీఈవోగా కంపెనీలోకి ఎంట్రీ ఇచ్చిన భీష్మ.. ఏం చేస్తాడు?. ఆర్గానిక్ వ్య‌వ‌సాయాన్ని ఎలా డెవ‌ల‌ప్ చేస్తాడు? త‌న ప్రేమ‌ను ఎలా గెలుచుకుంటాడు?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:

పెరుగుతున్న జ‌నాభాను దృష్టిలో ఉంచుకుని మ‌న వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను మార్చుకున్నాం. అయితే ర‌సాయ‌న‌ ఎరువుల‌ను ఎక్కువ‌గా వాడ‌టం వ‌ల్ల మ‌న భూమిలో సారం త‌గ్గిపోతుంది. విష‌పూరిత‌మైన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంటున్నాం. దీని వ‌ల్ల మ‌నుషుల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ఇలాంటి ప‌రిస్థితుల నుండి బ‌య‌ట ప‌డాలంటే సేంద్రీయ ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం చేయాల‌నే అవ‌గాహ‌న అంద‌రిలోనూ పెరుగుతుంది. ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల రాసుకున్న క‌థే భీష్మ‌. నితిన్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. మ‌న ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపించే నితిన్‌. సినిమా కోసం అహో, ఓహో అని క‌ష్ట‌ప‌డకుండా సింపుల్‌గానే క‌న‌ప‌డుతూ పాత్ర‌లో ఒదిగిపోయాడు. సంద‌ర్భానుసారం వ‌చ్చే స‌న్నివేశాల కామెడీలో నితిన్ బాగా న‌వ్వించాడు. ఇక ర‌ష్మిక చూడ‌టానికి గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డ‌ట‌మే కాదు.. డాన్సుల్లో కూడా నితిన్‌తో పోటీ ప‌డి చేసింది. ఇక భీష్మ అనే కంపెనీ అధినేత‌గా అనంత్ నాగ్‌, పోలీస్ క‌మీష‌న‌ర్‌గా సంప‌త్‌, ప‌రిమిత పాత్ర‌లో హెబ్బాప‌టేల్ , హీరో తండ్రి పాత్ర‌లో న‌రేష్‌, బ్ర‌హ్మాజీ, న‌ర్రా శ్రీనివాస్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. ఇక వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు, నితిన్ కామెడీ ట్రాక్ చాలా బావుంది. సింపుల్ క‌థ‌ను వీరి కామెడీ చ‌క్క‌గా న‌డిపించింది. ఇక జిస్సుసేన్ గుప్తా విల‌నిజం గొప్ప‌గా లేదు. మ‌రి సింపుల్‌గా ఉంది. సంప‌త్ క్యారెక్ట‌ర్‌ను క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో చూపించిన తీరులో కామెడీ పీస్‌ను చేసేశారు.

ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల క‌థ‌ను మ‌లిచిన తీరుని అభినందించాల్సిందే. సింపుల్ లైన్‌ను తీసుకుని, దాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లోకి మార్చ‌డ‌మే కాదు.. ఫ‌స్టాఫ్‌ను కామెడీ ట్రాక్‌తో న‌డిపిస్తూ.. సెకండాఫ్‌లో ఆ కామెడీ మిస్ కాకుండా త‌ను ఏం చెప్పాల‌నుకున్నాడో దాన్ని చ‌క్క‌గా చూపించాడు.  సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం బావుంది. పాట‌లు బావున్నాయి. ముఖ్యంగా వాట్టే బ్యూటీ పాట‌, అందులో డాన్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. సాయిశ్రీరామ్ త‌న సినిమాటోగ్ర‌ఫీతో స‌న్నివేశాల‌ను రిచ్‌గా చూపించాడు. సినిమా ఏదో సీరియ‌స్ మోడ్‌లో కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఎంజాయ్ చేసేలా తెర‌కెక్కించారు.

చివ‌ర‌గా... మంచి విష‌యాన్ని చెబుతూనే న‌వ్వులు పంచే 'భీష్మ‌'

Read Bheeshma Movie Review in English

Rating : 3.3 / 5.0