మరో జానపద గాయకురాలిని స్టార్‌ని చేసిన ‘‘భీమ్లా నాయక్’’ .. ఎవరీ కుమ్మరి దుర్గవ్వ..?
- IndiaGlitz, [Sunday,December 05 2021]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘‘భీమ్లా నాయక్’’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు నిర్మాతలు. ఇప్పటికే ‘‘భీమ్లా నాయక్’’ నుంచి విడుదలైన మూడు పాటలకు మంచి స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నాలుగో పాట విడుదలైంది. ‘కిందున్న మడుసులకా పోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు... దూకేటి కత్తులా కనికరమెరగవు.. అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు..’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్యశాస్త్రీ సాహిత్యం అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు.
ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ పాట పాడిన సింగర్ గురించి వెతకడం ప్రారంభించారు పవన్ ఫ్యాన్స్. దుర్గవ్వ తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందినది. ఆమె చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉండేది. తెలుగుతో పాటు మరాఠీలోనూ ఆమె ఎన్నో పాటలు పాడారు. దుర్గవ్వ పాడిన జానపదాల్లో.. 'ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే', 'సిరిసిల్ల చిన్నది' వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆమె ప్రతిభను గుర్తించిన భీమ్లా నాయక్ యూనిట్ ఈ సినిమాలోని ‘అడవి తల్లి’ పాట పాడే అవకాశం కల్పించింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ .. దీనికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.