రేయ్ బాలు.. లేచి రా!!: భారతీరాజా
- IndiaGlitz, [Tuesday,August 18 2020]
తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా కరోనా వైరస్ కారణంగా చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను ఉద్దేశించి ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. అందులో భారతీరాజా మాట్లాడుతూ ‘‘రేయ్ బాలు!! ఎస్.పి.బాలు లేచి రారా! రేయ్ అనే హక్కును నేను నీకు... నువ్వు నాకు ఇచ్చి యాబై ఏళ్లు అవుతున్నాయి. చిన్నప్పుడు నా స్నేహితులతోనూ నేను ఇంత క్లోజ్‌గా లేను. నీ తొలి సాంగ్ ‘ఆయిర నిలవే వా!..’ నీకు గుర్తుందా! ఎం.ఎస్.వి కచేరి అది చెన్నైలో అయినా, వేలూరులో జరిగినా నీ ఫియట్ కారులో నువ్వే డ్రైవింగ్ చేసుకుంటే పోయేవాడివి. నీతో పాటు నేను వచ్చేవాడిని తెలుసుగా. ఎందుకో తెలుసా? నీకు ఎక్కడ నిద్ర వచ్చేస్తుందోనని. ఓసారి కె.విశ్వనాథ్‌గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిపించమని నేను నిన్ను అడిగినప్పుడు ‘ఏరా కథేమైనా రాసుకున్నావా?’ అని నువ్వు నన్ను అడిగావు. అలాగే ‘నేషల్ ఫిలిం డెవలప్ కార్పొరేషన్ వారి సపోర్ట్‌తో ఒకటిన్నర లక్షలో సినిమా తీయవచ్చును’ అనే ఆలోచన కూడా నువ్వే చెప్పావు. నువ్వు, నేను కలిసి ప్రసాద్ ల్యాబ్స్‌కు వెళ్లినప్పుడు ‘మైల్’ అనే కథను నీకు చెప్పాను. నీకు అది బాగా నచ్చింది.
నీకు పల్లవి పాప పుట్టినప్పుడు.. నీపై ఉన్న అభిమానంతో ఆ పాప పేరు మీద నేను ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేశాను. కొన్ని కారణాలతో ఆ ప్రొడక్షన్ హౌస్ క్లోజ్ అయ్యిందనుకో. అలా మొదలైన మన స్నేహం పెరిగి పెద్దదైంది. ఓసారి నెల్లూరులో జరిగే కచేరికి నేను ,ఇళయరాజా, భాస్కర్ కలిసి వెళ్లాం. మీ ఇంట్లో కూర్చుని తిన్నాం. మీ ఇంటి ఉప్పు తిన్నాను. అలాంటి నీకు.. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి మనసెలా వస్తుంది. నువ్వలా ఒప్పుకోవు. నువ్వు తిరిగి వస్తానవే నమ్మకం నాకుంది. ఈ ప్రపంచంలోని కళాకారులందరూ నీ కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా కన్నీళ్లు నాకు అగడం లేదు. నేను పూజించే పంచభూతాలుండేవి నిజమైతే.. నువ్వు మళ్లీ వస్తావు. మాతో స్నేహం చేస్తావు. వేల పాటలు పాడాలి. వచ్చేయి రా!’’ అన్నారు.