గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్..

  • IndiaGlitz, [Saturday,July 18 2020]

భారత్ బయోటెక్ అభివ‌ృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుని ఈనెల 15న మనుషులపై ఫేస్ 1 క్లినికల్ ట్రయల్స్‌ని నిర్వహించినట్టు భారత్ బయోటెక్ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఇండియా మొత్తం మీద 375 మంది వలంటీర్లపై ర్యాండమైజ్డ్, డబుల్ బ్లెండ్, ప్లాసిబో-కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. కాగా.. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ దేశంలోని 12 ఆసుపత్రులను ఎంచుకుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఆసుపత్రులకు అనుమతి లభించింది.

తెలంగాణలో నిమ్స్, విశాఖలోని కేజీహెచ్‌‌ను క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపిక చేశారు. నిమ్స్‌లో 12 మంది వలంటీర్ల ఎంపిక పూర్తయింది. మరోవైపు హరియాణాలోని రోహ్‌తక్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో శుక్రవారం క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్టు హరియాణా ఆరోగ్యశాఖా మంత్రి అనిల్‌విజ్ తెలిపారు. ముగ్గురు వలంటీర్లకు వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చారని.. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని.. ఎవరిలోనూ ఎలాంటి దుష్ఫలితాలూ కనిపించలేదని అనిల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతా ఓకే అయి క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితేనే త్వరలోనే ఇండియా నుంచి కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా క్లినికల్ ట్రయల్స్‌ను ముగించుకుని ఒకడుగు ముందుకు వేసిన సంగతి తెలిసిందే.