Bharat Ratna:భారతరత్న పురస్కారం విజేతలు ఎవరంటే..? జాబితా ఇదే..
- IndiaGlitz, [Saturday,February 10 2024]
దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna) పురస్కారాన్ని 1954 జనవరి 2న, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రారంభించారు. వివిధ రంగాలలో అసాధారణ సేవలందించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. భారతరత్న అవార్డు అందుకున్న వారు దీనిని గొప్ప గౌరవంగా భావిస్తారు. 1954లో కేవలం బతికి ఉన్నవారికే ఈ అవార్డు అందించేవారు. 1955 తర్వాత మరణించిన వారికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. ది గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అవార్డు గ్రహీతల పేర్లు అధికారికంగా ప్రకటిస్తారు
భారతరత్న(Bharat Ratna) అవార్డు కోసం వ్యక్తులను ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. అనంతరం రాష్ట్రపతి ఆ పేర్లను ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, ఒక మెడల్ బహూకరిస్తారు. రావి ఆకు రూపంలో ఉన్న మెడల్‌పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ, దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనుకవైపు భారత జాతీయ చిహ్నం, కింద దేవనాగరి లిపిలో సత్యమేవజయతే అనే అక్షరాలు ఉంటాయి. వీరికి ఎలాంటి నగదు పురస్కారం లభించదు.
భారతరత్న పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత తర్వాత గౌరవం లభిస్తుంది. ఇప్పటివరకు మొత్తం 52 మందికి భారతరత్న పురస్కారాలు అందగా.. ఇందులో 22 మందికి మరణానంతరం అవార్డును ప్రకటించారు.
భారతరత్న గ్రహీతలు వీరే..
దేశంలోనే తొలి భారతరత్న అవార్డు తమిళనాడుకు చెందిన చక్రవర్తి రాజగోపాలాచారికి లభించింది. స్వతంత్ర భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్‌గా, మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సేవలకు గానూ 1954లో ఈయనకు అవార్డును ప్రకటించారు. అనంతరం ఇదే సంవత్సరం భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్, తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అంటే భారతరత్న పురస్కారం అందుకున్న తొలి ముగ్గురు వ్యక్తులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం.
1955లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తత్వవేత్త భగవాన్ దాస్, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో పాటు కర్ణాటకకు చెందిన ప్రముఖ సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలకు భారతరత్న అవార్డు లభించింది.
1957లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు గోవింద్ వల్లభ్ పంత్, 1958లో మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త డీకే కార్వే, 1961లో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బిధాన్ చంద్ర రాయ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు పురుషోత్తమ దాస్ టాండన్ భారతరత్న పురస్కారం అందుకున్నారు.
ఇక 1962లో దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ భారతరత్న అవార్డు అందుకున్నారు. ఈ ముగ్గురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. అనంతరం రాష్ట్రపతిగా సేవలు అందించిన జాకీర్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు పాండురంగ వామన్ కానే 1963లో భారతరత్న అందుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రికి 1966లో.. తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీకి 1971లో భారతరత్న ప్రకటించారు. తర్వాత 1975లో ఒడిశాకు చెందిన వీవీ గిరికి కేంద్రం అవార్డు లభించింది.
తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు కుమారస్వామి కామరాజ్‌కు 1976లో భారతరత్న పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్కోపేకు (మాసిడోనియా)చెందిన సంఘ సేవకురాలు మదర్ థెరిస్సాకు 1980లో భారతరత్న అందుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు వినోబ్ భావేకు 1983లో.. పాకిస్థానీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు 1987లో ఈ పురస్కారం అందించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు 1988లో భారతరత్న ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్, దక్షిణాఫ్రికా దేశానికి చెందిన నెల్సన్ మండేలాను 1990లో భారతరత్న అవార్డుతో సత్కరించారు
1991లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి, గుజరాత్ రాష్ట్రానికి చెందిన తొలి ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌లకు భారతరత్న ప్రకటించారు .
ఇక 1992లో పశ్చిమబెంగాల్‌కు చెందిన మాజీ కేంద్రమంత్రి అబుల్ కలాం అజాద్, ప్రముఖ దర్శకడు సత్యజిత్ రే, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్‌డీ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం లభించింది.
1997లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అజాద్‌కు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు అరుణా అసఫ్ అలీకి అవార్డు ప్రకటించారు.
1998లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంగీత విద్యాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి, రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్యం ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
1999వ సంవత్సరంలో బీహార్ వాసి లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంగీత విద్వాంసులు పండిట్ రవిశంకర్, అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలిలు భారతరత్న అందుకున్నారు.
2001లో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్, బీహార్‌కు చెందిన ఈయన షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.
2009లో కర్ణాటకకు చెందిన హిందుస్థానీ గాయకుడు పండిట్ భీమ్‌సేన్ జోషికి భారతరత్న అవార్డు దక్కింది.
2014లో ఇదే కర్ణాటకు చెందిన రసాయన శాస్త్ర పరిశోధకుడు సీఎన్ఆర్ రావు, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారతరత్న పురస్కారం అందుకున్నారు.
2015లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, బేనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు మదన్ మోహన్ మాలవీయలకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించింది.
2019లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి భూపేన్ హజారికా, మహారాష్ట్రకు చెందిన సామాజిక ఉద్యమకారుడు నానాజీ దేశ్‌ముఖ్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు.
చివరగా 2024లో అత్యధికంగా ఐదుగురి భారతరత్న అవార్డు ప్రకటించడం విశేషం. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, ఢిల్లీకి చెందిన బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధాని చరణ్ సింగ్, తమిళనాడుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లను భారతరత్న అవార్డుకు ఎంపిక చేశారు.
మొత్తంగా చూసుకుంటే 1954 నుంచి 2024 వరకు ఈ 70 సంవత్సరాల్లో 52 మంది ప్రముఖులు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు.
వీరిలో లాల్ బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడర్, వినోబాభావే, ఎంజీ రామచంద్రన్, బీఆర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ, సర్ధార్ వల్లభాయ్‌పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, గుల్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ, జయప్రకాశ్ నారాయణ్, మదన్ మోహన్ మాలవీయ, నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికా, కర్పూరీ ఠాకూర్, పీవీ నరసింహరావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు మరణానంతరం అవార్డు లభించింది.