PV Narasimha Rao:తెలుగుతేజం పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం
- IndiaGlitz, [Friday,February 09 2024]
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఆయనతో పాటు దివంగత మరో మాజీ ప్రధాని చరణ్‌సింగ్, హరిత విప్లవ పితాహుడు, దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను కూడా అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా పీవీ నరసింహా రావు ఓ మేధావి అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారని తెలిపారు. అటు ఎంపీగానూ ఎన్నో ఏళ్లుగా సేవలందించారని.. భారత ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన వ్యక్తి అంటూ కొనియాడారు. దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రధానిగా ఆయన అందించిన సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మోదీ చెప్పుకొచ్చారు.
దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టం. దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన తన జీవితమంతా రైతుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అంకితమయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, హోంమంత్రి అయినా దేశ నిర్మాణానికి ఊతమిచ్చారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా గట్టిగా నిలబడ్డారు. మన రైతు సోదరసోదరీమణుల పట్ల ఆయనకున్న అంకితభావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం’’ అంటూ మోదీ తెలిపారు. రైతుబంధుగా మాజీ ప్రధాని చరణ్ సింగ్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.
వ్యవసాయ రంగంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం డాక్టర్ MS స్వామినాథన్‌కి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వ్యవసాయంలో దేశం స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. డాక్టర్ స్వామినాథన్ యొక్క దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశ ఆహార భద్రత, శ్రేయస్సుకు ఉపకరించింది. అని మోదీ చెప్పుకొచ్చారు.
కాగా ఈ ఏడాది ఇప్పటికే బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాణీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్లకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఐదుగురు నేతలకు భారతరత్న అవార్డు ప్రకటించడం విశేషం.