LK Advani:బిగ్ బ్రేకింగ్: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సహ వ్యవస్థాపకులు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధికారికంగా వెల్లడించారు. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం అని ప్రశంసించారు.
"ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయనతో ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడి అభినందించాను. దేశ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిది. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అద్వానీ డిప్యుటీ ప్రధాన మంత్రి స్థాయి వరకూ ఎదిగారు. హోం మంత్రిగానూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన చేపట్టిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చారు. ఆయన ఎంతో మందికి ఆదర్శనీయుడు. పార్లమెంటులో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది." అని ట్వీట్ చేశారు. కాగా ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూర్ ఠాగూర్‌కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో లాల్ కృష్ణ అద్వానీ దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. అంతేకాకుండా అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం రథయాత్ర కూడా చేపట్టారు. 1927 జూన్ 8న అఖండ భారతదేశంలో ఉన్న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాలు వయస్సులోనే ఆర్ఎస్‌ఎస్‌లో చేరారు. దేశ విభిజన సమయంలో భారత్‌కు వలస వచ్చి దేశ రాజకీయాలకు అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు.
1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలు అందించారు. అనంతంరం బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో బీజేపీని బలంగా తీసుకెళ్లారు. 1986లో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి 1991 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1993 నుంచి 1998 వరకు రెండో సారి పార్టీ అధినేతగా పనిచేశారు. 2004 నుంచి 2005 వరకు మూడోసారి పార్టీని నడిపించారు. ఆయన హయాంలోనే బీజేపీ దేశ రాజకీయాల్లో బలంగా నిలబడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com