పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్: పిల్లలకు కొవిడ్ టీకా.. భారత్ బయోటెక్ ‘‘కొవాగ్జిన్‌కు’’ డీసీజీఐ అనుమతి
- IndiaGlitz, [Sunday,December 26 2021]
దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. భారత్‌లోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. దీంతో థర్డ్ వేవ్ తప్పదని.. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల టెన్షన్ తీరేలా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలో పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కొవిడ్ టీకా ‘‘కొవాగ్జిన్’’ను అత్యవసర వినియోగానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ మండలి) అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఆమోదంతో 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ టీకాను వేయనున్నారు. దీంతో పిల్లలకు ఇండియాలో మొదటి టీకాగా కొవాగ్జిన్ రికార్డుల్లోకెక్కనుంది. భారత్ బయోటెక్.. 2 నుంచి 18 ఏళ్ల వారికి.. వ్యాక్సినేషన్ కోసం క్లినికల్ ట్రయల్స్ డేటాను..సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి కొద్దిరోజుల క్రితం సమర్పించింది. మరోవైపు చిన్నారుల కోసం ఆరు నెలల్లోనే టీకాను తీసుకురాబోతున్నట్లు సీరం అధినేత అదర్ పూనావాలా ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం కొవొవాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. 3 ఏళ్లు పైబడ్డ పిల్లలందరికీ ఈ టీకాను ఇవ్వొచ్చని పూనావాలా స్పష్టం చేశారు.
కాగా.. జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభిస్తామని... దీని వల్ల పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళనలు తగ్గనున్నాయని ప్రధాని చెప్పారు.