'భ‌ర‌త్ అనే నేను'.. ఆ రెండు సెంటిమెంట్స్‌

  • IndiaGlitz, [Monday,April 09 2018]

సినిమా ప‌రిశ్ర‌మ‌ అంటేనే సెంటిమెంట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. అందుకే ముహూర్తం షాట్ నుంచి విడుదల తేదీ వరకు ప్రతీది కూడా గతంలో జరిగిన  అంశాలను, కాంబినేషన్‌లను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

అయితే.. ఈ సెంటిమెంట్ కేవలం దర్శక, నిర్మాతలతో పాటు నటీనటుల వరకు మాత్రమే ప‌రిమిత‌మ‌వుతుంద‌నుకుంటే పొరపాటే. దాన్ని అభిమానులు కూడా బాగా ఫాలో అయిపోతూ ఉంటారు. 'భ‌ర‌త్ అనే నేను'కు సంబంధించి అలాంటి రెండు సెంటిమెంట్స్ ఉన్నాయంటున్నారు మ‌హేష్ అభిమానులు.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మహేష్‌ను ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్‌గా మార్చిన 'పోకిరి' చిత్రంలో.. ఓ పాట కోసం తొలిసారిగా లుంగీ కట్టి డాన్స్ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కట్ చేస్తే.. 'శ్రీమంతుడు' సినిమాలో కూడా లుంగీ కట్టారు. అది మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు మూడోసారి 'భరత్ అనే నేను' చిత్రంలో కూడా ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేశారు దర్శకుడు కొరటాల శివ.

అలాగే.. 'పోకిరి' సినిమాలో ఓ షాట్ కోసం ఖైదీ నంబర్ 4005గా మహేష్ కనిపించగా.. ఇప్పుడు 'భరత్ అనే నేను' పోస్టర్‌లలో మహేష్ కార్ నంబర్ 4005 అని ఉంటుంది.  ఈ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యాన్స్ ఈ సినిమా కూడా హిట్ అనే ధీమాలో ఉన్నారు.