రాజకీయాలు, రాజకీయ నాయకులకు సంబంధించిన సినిమాలు ఎన్నో వస్తుంటాయి. అయితే స్టార్ హీరో పొలిటికల్ మూవీలో నటిస్తే ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. శ్రీమంతుడు మూవీ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్, కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా అంటే అందరిలో అంచనాలు బారీగా పెరిగాయి. ఈ అంచనాలకు తగ్గట్లు `భరత్ అనే నేను` చిత్రంలో మహేశ్‌ను కొరటాల ముఖ్యమంత్రి పాత్రలో చూపిస్తానని చెప్పడమే. గతంలో శంకర్ ఒకేఒక్కడులో అర్జున్‌ని సీఎం పాత్రలో చూపించి మన్ననలు అందుకున్నాడు. మరి ఈ సినిమాలో కొరటాల ముఖ్యమంత్రిగా మహేశ్‌ను ఎలా చూపిస్తాడనే దానిపై అందరిలో ఆసక్తి కలిగింది. నాయకుడనేవాడు లేకుండా చేయడమే నాయకుడి లక్షణం అనే కాన్సెప్ట్‌తో శివ చేసిన భరత్ అనే నేను సినిమా ద్వారా మహేశ్, కొరటాల శివ అండ్ టీం ఏం చెప్పాడో తెలియాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
రాఘవ(శరత్ కుమార్), వరదరాజులు(ప్రకాశ్ రాజ్) కలిసి ప్రజలకు సేవ చేయడానికి నవోదయం అనే పార్టీని స్థాపిస్తారు. బిజీగా ఉండటం రాఘవ కొడుకు భరత్(మహేశ్) గురించి పట్టించుకోడు. రాఘవ భార్య (ఆమని) ఆనారోగ్యంతో చనిపోవడంతో.. భరత్ కోసం రాఘవ మరో పెళ్లి చేసుకుంటాడు. అయితే పినతల్లి తనను పట్టించుకోకవపోడంతో భరత్.. తన మావయ్యతో కలిసి లండన్ వెళ్లిపోతాడు. అక్కడే చదువుకుని పెరిగి పెద్దవుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో రాఘవ రాజకీయంగా ఎదిగి ముఖ్యమంత్రి అవుతాడు. అయితే అనుకోకుండా రాఘవ అనారోగ్యంతో చనిపోతాడు. ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే దానిపై పార్టీలో కుమ్ములాటలు మొదలవుతాయి. రంగంలోకి దిగిన వరదరాజులు భరత్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడు. రాజకీయాలంటే ఏమీ తెలియని భరత్ నెమ్మదిగా అన్నీ విషయాలను నేర్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతాడు. కథ సాగే క్రమంలో ఎంబీఏ చదివిన వసుమతి(కియరా అద్వాని)తో ప్రేమలో పడతాడు భరత్. ఇక రాజకీయంగా తన పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి ప్రజలకు మంచి పనులు చేస్తాడు. అయితే కొన్ని కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తాడు భరత్. అసలు ఇంతకు ఆ కారణాలేంటి? అసలు రాఘవ ఎందుకు చనిపోతాడు? చివరకు భరత్ తను అనుకున్న మంచి పనులు చేస్తాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..
ప్లస్ పాయింట్స్
మహేష్ అందగాడు. సినిమా మొదటి నుంచీ చివరిదాకా ఆయనే ఉన్నా జనాలు చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో అదే జరిగింది. మహేష్ లుక్స్, పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్. హీరోయిన్ కూడా తెరమీద కనిపించినంత సేపు చక్కగా ఉంది. భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ బావుంది. ప్రకాష్‌రాజ్ కూడా ఇందులో కొత్తగా కనిపించారు. పోసాని, రవిశంకర్, శత్రు, పృథ్వి, రాహుల్ రామకృష్ణన్ తమ తమ పాత్రల్లో మెప్పించారు. రావుర మేష్ కీ, దేవరాజ్‌కీ నటించడానికి సినిమాలో కేరక్టర్ పెద్దగా లేదు. అసెంబ్లీ సెట్, వచ్చాడే సాంగ్ సెట్, దేవదారు శిల్పంలా సెట్ బావున్నాయి. ఫైట్లు హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. డైలాగులు అక్కడక్కడా మెప్పించాయి. తెలుగు మీద శ్రద్ధ పెరుగుతోన్న ఈ కాలంలో `అంతఃకరణ`వంటి పదాలను హీరోతో పలికించడం బావుంది.
మైనస్ పాయింట్లు
సినిమాలో ఏ సన్నివేశం కూడా ఎగ్జయిటింగ్‌గా అనిపించదు. ప్రతిదీ ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. `శ్రీమంతుడు`లో హీరో కారులో వెళ్తూ హీరోయిన్‌ని తొలిసారి చూస్తాడు. ఈ చిత్రంలోనూ అంతే. పెద్దగా లవ్‌కీ, రొమాన్స్ కీ స్కోప్‌లేని సబ్జెక్ట్ ఇది. కామెడీ కూడా ఏమీ లేదు. కథ, అందులో సమస్యలు, పరిష్కారాలు అన్నీ ఉన్న మాట నిజమే అయినా, అవన్నీ వాస్తవాలకు మరింత దూరంగా ఉన్నాయి. గ్రామాలకు స్వయంపరిపాలన ఇవ్వడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యంకాని పని. ప్రజాస్వామ్యంలో వేలకు వేలు చలానాలు కట్టాలంటే ఎవరూ ముందుకు రారు. కాబట్టి వాటన్నిటినీ సినిమాలో చూస్తున్నంత సేపు బావుంటుంది. నిడివి బాగా ఎక్కువైంది. ఎంత పదునుగా కత్తిరించినా క్లైమాక్స్ కి ముందు శరత్‌కుమార్‌ని ప్రకాష్‌రాజ్ చంపే సన్నివేశంలో కొన్ని డైలాగులు.. అంతకు ముందు జరిగిన ఇంకేదో కథని సూచిస్తాయి. భావోద్వేగాలు పెద్దగా పండలేదు.
విశ్లేషణ
విదేశాల్లో చదువుకున్న హీరో తండ్రి ఇండియాలో పెద్ద స్థాయిలో ఉంటాడు. అతను ఉన్నట్టుండి చనిపోతే కొడుకు బాధ్యతలు నిర్వర్తిస్తాడు... కొన్నాళ్లకు తండ్రిది మామూలు మరణం కాదని, వెనుక ఏదో పెద్ద కుట్ర జరిగిందని తెలుస్తుంది. అందుకు కారకులైనవారిని హీరో ఎలా తుదముట్టించాడు అనే కథతో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. హీరో సీఎం కావడం అనేది ఆ మధ్య శంకర్ `ఒకే ఒక్కడు`లోనూ, ఇటీవల శేఖర్‌కమ్ముల `లీడర్`లోనూ చూశాం. అందులో ఉన్న విషయాలను కాస్త అటూ ఇటూగా ఇందులోనూ ఉన్నాయి. ట్రాఫిక్, విద్య, వైద్యం, చేతి వృత్తులు, వ్యవసాయం వంటివాటిని ఇందులోనూ చూపించారు దర్శకుడు. అయితే ఏ విషయాన్నీ లోతుగా ప్రస్తావించలేదు. విశాలమైన సబ్జెక్ట్ కావడంతో ఇప్పటికే నిడివి కూడా ఎక్కువే అయింది. మధ్యలో కమర్షియల్ వేల్యూస్ కోసం పాటలను, ఫైట్లను చొప్పించారు. వాటివల్ల ప్రయోజనం ఉన్నా లేకున్నా, చొప్పించిన విధానం మాత్రం బావుంది. ఎప్పుడూ పక్కవాళ్ల మాటను వింటూ పరాన్నభుక్కులాగా ఉండకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ, త్వరగా నేర్చుకుంటూ ఇచ్చిన మాటకోసం నిలబడే వ్యక్తిని హీరోగా చూపించడం బావుంది. లీడర్‌షిప్ క్వాలిటీస్ ని ప్రతి సీన్‌లోనూ చక్కగా ఎలివేట్ చేశారు. గత చిత్రాలతో పోల్చుకుని చూస్తే పెద్దగా ఎక్కదు. కానీ కొత్తగా చూసేవారికి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సమ్మర్‌లో సరదాగా చూసేయొచ్చు.
Bharat Ane Nenu Movie Review in English
Comments