టాప్ హీరోస్ అందరికీ అర్ధనారి కథ నచ్చింది కానీ..వాళ్లు చేయకపోవడానికి కారణం అదే. - డైరెక్టర్ భానుశంకర్ చౌదరి
- IndiaGlitz, [Wednesday,June 29 2016]
రాజు మహరాజు, సరదాగా అమ్మాయితో..తదితర చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ భానుశంకర్ చౌదరి తాజా చిత్రం అర్ధనారి. నూతన నటీనటులు అర్జున్ యజత్, మౌర్యాని ప్రధాన తారాగణంగా భానుశంకర్ చౌదరి అర్ధనారి చిత్రాన్ని తెరకెక్కించారు. పత్తికొండ సినిమాస్ బ్యానర్ పై రవికుమార్.ఎమ్ నిర్మించిన అర్ధనారి చిత్రం జులై 1న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అర్ధనారి డైరెక్టర్ భానుశంకర్ చౌదరితో ఇంటర్ వ్యూ మీకోసం...
అర్ధనారి టైటిల్ డిఫరెంట్ గా ఉంది..అసలు అర్ధనారి కాన్సెప్ట్ ఏమిటి..?
అర్ధనారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన సినిమా. రెగ్యులర్ మూవీస్ కి భిన్నంగా ఉంటుంది. ఇందులో అర్ధనారి క్యారెక్టరైజేషన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు...నెక్ట్స్ ఏం జరుగుతుందో అని ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఇది ఉద్వేగభరితమైన చిత్రం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఖచ్చితంగా ఎమోషనల్ గా ఫీలవుతారు. మా టీమ్ మొత్తాన్ని అభినందిస్తారు. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
అర్ధనారి ద్వారా ఆడియన్స్ కి ఏం చెబుతున్నారు..?
బాధ్యత లేనివాడికి భారతదేశంలో బతికే హక్కు లేదు అని చెబుతున్నాను. బాధ్యత అనేది ఎంత గొప్పదో తెలియచెప్పే చిత్రం మా అర్ధనారి.
ఈ చిత్రాన్నికొత్తవాళ్లతో చేసారు కదా...ఇలాంటి కాన్సెప్ట్ తో కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా..?
ఇలాంటి కాన్సెప్ట్ తో...అదీ.. కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్క్ అని చాలా మంది చెప్పారండి. మా నిర్మాతలు కథ విని చాలా ఎమోషనల్ గా ఫీలయ్యారు. బిజినెస్ గురించి ఆలోచించకుండా ఒక ప్రొడక్ట్ చేద్దాం సినిమా తీసిన తర్వాత ఎలా బిజినెస్ చేద్దాం అని ఆలోచిద్దాం అన్నారు. అలా మా నిర్మాతలు ప్రొత్సహించడంతో ఈ సినిమా చేసాను. ఈ సినిమాని చూసిన కొంత మంది చాలా బాగుంది అని అభినందించడంతో ధైర్యంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
ఈ కథకు ఇన్ స్పిరేషన్ ఏమిటి..?
మనలో మనకు తెలియకుండానే ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీలవుతుంటాం. కానీ మనం స్పందించకుండా ఉండిపోతుంటాం. అలా స్పందించలేనప్పుడు ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి అందులో మనల్ని మనం చూసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసాను. ఒక కామన్ మేన్ ఎమోషన్స్ ని డిఫరెంట్ గెటప్ ద్వారా చెప్పించాలని చేసిన ప్రయత్నమే అర్ధనారి.
రాజు మహరాజు, సరదాగా అమ్మాయితో..ఇలా లవ్ & ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తో సినిమాలు తీసిన మీరు ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి కారణం ఏమిటి..?
ఒక నిర్మాత దగ్గరికి వెళ్లి రెండు కథలో మూడు కథలో చెబుతాం. వాళ్లకు నచ్చిన కథలతో సినిమాలు చేయాలి. ఎందుకంటే బతుకు తెరువు కోసం కొన్ని పాటించాలి. నాకు నచ్చిన కథలు వాళ్లకు నచ్చిన కథలతో చేసిన సినిమాలు అవి. రియల్ గా చెప్పాలంటే...టి.కృష్ణ, విశ్వనాథ్ గారు చిత్రాలతో ఇన్ స్పైర్ అయి ఇండస్ట్రీకి వచ్చాను. వాళ్ళ సినిమాలు చూసినప్పుడు తెలియకుండా ఒక ఉద్వేగానికి లోనయ్యేవాళ్లం. అలాంటి సినిమాలు చేయాలనుకున్నాను. బిగినింగ్ డేస్ లో అలాంటి కథలు చెప్పినా ఎవరూ ఇంట్రస్ట్ చూపించే వాళ్లు కాదు. అయితే..నా ఆలోచనలకు తగ్గట్టు ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నాను అని ఆలోచించి ఈ కథ నా ఫ్రెండ్స్ కి చెప్పాను. వాళ్లు ఇన్ స్పైయిర్ అవ్వడంతో నా డ్రీమ్ ఈ విధంగా నెరవేరబోతుంది.
ఈ చిత్రంలో హిజ్రా క్యారెక్టర్ ని కొత్త ఆర్టిస్ట్ తో చేయించారు కదా...ఈ క్యారెక్టర్ కి ఇండస్ట్రీలో ఎవర్నైనా సంప్రదించారా..?
చాలా మందిని కాంటాక్ట్ చేసి కథ చెప్పాను. కథ బాగుంది సినిమా చేద్దాం అన్నారు కానీ...రెండు నెలలు మూడు నెలలు వెయిట్ చేయించారు. ఆతర్వాత ఈ క్యారెక్టర్ చేయడం రిస్క్ అని నో చెప్పారు. ఒక పెద్ద కంపెనీ 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యింది. వాళ్లే పెద్ద హీరోల దగ్గరకి ఈ కథ చెప్పమని నన్ను పంపించారు. టాప్ హీరోస్ అందరికీ ఈ కథ చెప్పాను. అందరూ కథ బాగుంది కానీ... రిస్క్ అంటూ చేయలేదు. సరే అని వేరే లాంగ్వేజ్ లో కూడా ట్రై చేసాం. వాళ్లు కూడా ఇదే మాట ఈ గెటప్ కాస్త క్లిష్టమైన గెటప్. మాకు చాలా ఇమేజ్ ఉంది. మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు రిస్క్ అవుతుందేమో అనే భయంతో రిజక్ట్ చేయడం జరిగింది. ఆ టైమ్ లో మా నిర్మాతలు ముందుకు రావడంతో ఈ సినిమా చేసాం.
మీతో ఫస్ట్ ఈ సినిమాని చేయాలనుకున్న నిర్మాతలకు అర్ధనారి సినిమాని చూపించారా..?
సినిమా రెడీ అయిన తర్వాత ఫస్ట్ నాతో సినిమా చేయాలనుకున్న నిర్మాతలకే చూపించాను. ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. అయితే అందరూ కొత్తవాళ్లు కాస్త రిస్క్ అవుతుందేమో అన్నారు. ఆ టైమ్ లో కోటగిరి వెంకటేశ్వరరావు గారు టెన్షన్ పడకు అంటూ నాకు చాలా సపోర్ట్ చేసారు. ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరనేది త్వరలో తెలియచేస్తాను.
చాలా మంది ఈ క్యారెక్టర్ చేయడం రిస్క్ ఏమో అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది..?
ఇండస్ట్రీకి మంచి సినిమా కాదు కమర్షియల్ సినిమా కావాలి అనిపించింది. ఫైట్స్, పాటలు...ఉన్న కమర్షియల్ సినిమాలే కావాలి. కొత్త స్ర్కిప్ట్ అవసరం లేదు అనిపించింది. నిజంగా 100% అవసరం లేదనిపించింది. మంచి సినిమాని తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రేక్షకుల దగ్గరికి వెళ్లాలంటే ఎంతో మందిని దాటుకుని వెళ్లాలి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు దానికి బిచ్చగాడు సినిమానే ఉదాహరణ. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది మంచి కథలు రాసే క్రియేటర్స్ ఉన్నారు. యూత్ అద్భుతమైన పాయింట్స్ తో ముందుకు వస్తున్నారు. అయితే... రైటర్స్ రాసుకున్న మంచి కథలు ఫైల్స్ గానే మిగిలిపోతున్నాయి కానీ సినిమాల రూపంలో బయటకు రావడం లేదు.
ఇండస్ట్రీలో మీరనుకుంటున్నట్టుగా మార్పు రావాలంటే ఏం చేయాలి..?
ఇండస్ట్రీ మారాలంటే ముందు మీడియా మారాలి. మంచి సినిమాకి మంచి రేటింగ్ ఇవ్వాలి. చెత్త సినిమాకి చెత్త రేటింగ్ ఇవ్వాలి.
మీడియాలో అలా ఎందుకు జరుగుతుంది అంటారు..?
మీడియాలో చాలా మంది సరైన రేటింగ్స్ ఇవ్వడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు తెలియడం లేదు. రీసెర్చ్ చేసి నెక్ట్స్ ఇంకో సినిమా చేయాలి.
అంటే...మీడియా పై సినిమా తీయాలనుకుంటున్నారా..?
మీడియా గొప్పది మీడియా వాళ్లు గొప్ప వ్యక్తులు. మీడియా గురించి మాట్లాడడం లేదు. మంచి సినిమాని ప్రొత్సహించాలి. అది మీడియా అవ్వచ్చు నిర్మాత అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు. మీడియా మంచి సినిమాని ప్రమోట్ చేయడం వలనే బిచ్చగాడు ఆడింది.
సినిమా రివ్యూ ప్రభావం సినిమా రిజల్ట్ పై ఉంటుందా..?
మొన్నటి వరకు నమ్మాను. ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. ఇలాంటి దృక్పధమే వస్తే ఫ్యూచర్ లో నమ్మకపోవచ్చు.
ఈ సినిమాలో హిజ్రా క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అర్జున్ ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్ లా నటించాడు అని చెబుతున్నారు కదా...అంతలా ఈ చిత్రంలో ఏం చేసాడు..?
కొత్తవాడైనప్పటికీ.... అద్భుతమైన ఎమోషన్స్ ని పండించగలిగాడు. ఎన్నో వేరియేషన్స్ ఉన్న కథ ఇది. అన్ని వేరియేషన్స్ లో అద్భుతంగా నటించాడు. అలాంటి ఆర్టిస్టులు అరుదుగా పుడతారు. అందుకనే అతనిలో నాకు ఓ రజనీకాంత్, ఓ కమల్ హాసన్ కనిపించారు.
ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు..?
రిజల్ట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ఉంది. మంచి రిజల్ట్ వస్తే మరెన్ని మంచి చిత్రాలు తీయడానికి ప్రయత్నిస్తాను.