చంద్రబాబు, లోకేష్‌పై భానుచందర్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌పై ప్రముఖ సినీ నటుడు భానుచందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత కొన్నిరోజులుగా ఏపీ దేవాలయాల్లో జరుగుతున్న వరుస విగ్రహాల ధ్వంసంపై స్పందించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం నీచమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయం దారుణమని వ్యాఖ్యానించారు. బాబు నీచమైన రాజకీయ నాయకుడని.. ఆయన నైజం గురించి ఆనాడే ఎన్టీఆర్ స్ఫష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్నగారిని చంద్రబాబు ఎంతో క్షోభపెట్టారన్నారు. ఎన్టీఆర్ గారు తనతో చెప్పిన మాటలను ఇప్పుడు మీడియా చెబితే చంద్రబాబుకు పుట్టగతులుండవని ఒకింత భానుచందర్ హెచ్చరించారు.
నారా లోకేష్‌కు రాజకీయ భవిష్యత్ లేదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబుది మొదట్నుంచి వక్రబుద్ధేనన్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలకి దగ్గర కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అందుకే ఎలాగైనా సరే ఆ పథకాలను డైవర్ట్ చేయడానికే ఇటువంటి కుట్రపూరిత కార్యక్రమాలు చేస్తున్నారని నటుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వైఎస్ జగన్ మనసున్న నాయకుడని.. పాదయాత్రలో తాను స్వయంగా పరిశీలించానన్నారు. ప్రతిపక్షాలు ఎన్నెన్ని కుటిల రాజకీయాలు చేసినా మరో 15 ఏళ్లపాటు సీఎంగా వైఎస్ జగనే కొనసాగుతారని భానుచందర్ చెప్పుకొచ్చారు. వైసీపీ మంత్రులు మొదలుకుని ఆ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా కౌంటర్లిచ్చే తెలుగు తమ్ముళ్లు.. మరీముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్న నటీనటులు భానుచందర్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout