'భలే భలే మగాడివోయ్' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ఈరోజుల్లో` సక్సెస్ తో తొలి సక్సెస్ అందుకున్న మారుతి తర్వాత బస్ స్టాప్` తో రెండో హిట్ కూడా అందుకున్నాడు. అయితే అంతే రేంజ్ లో తనపై విమర్శలు కూడా వచ్చాయి. దాంతో స్టయిల్ మార్చి ప్రేమకథాచిత్రమ్` తో సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన కొత్త జంట, లవర్స్` మంచి విజయాలు సాధించిన మారుతి అనుకున్న స్థాయి విజయాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇటువంటి సందర్భంలో యంగ్ హీరో నానితో, మారుతి కలిసి జి.ఎ 2, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్ పై చేసిన చిత్రమే భలే భలే మగాడివోయ్`. టైటిల్ మాస్ గా ఉన్నా ఎంటర్ టైనింగ్ సినిమా రూపొందిందని యూనిట్ సభ్యులు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ ఎంటర్ టైనింగ్ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ
లక్కీ(నాని) మొక్కలపై పరిశోధన చేసే అధ్యయన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తుంటాడు. అంత వరకు బాగానే ఉంది. అయితే లక్కీకి మతిమరపు అనే పెద్ద లోపం ఉంటుంది. దాంతో ముందు చేసే పనిని వదిలేసి రెండోపనిలోకి వెళ్లిపోతుంటాడు. దాని వల్ల తనకి చాలా సమస్యలు వస్తుంటాయి, పెళ్ళి కూడా కాదు. పిల్లనివ్వడానికి వచ్చిన పాండు రంగారావు(మురళీశర్మ) లక్కీకి ఉన్న లోపాన్ని తెలుసుకుని తనకి పిల్లనివ్వనని అంటాడు. ఇలాంటి సందర్భంలో ఓ రోజు నందన(లావణ్య త్రిపాఠి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తనకి కావాల్సిన వారికి సహాయం చేసి తనకి దగ్గరవుతాడు. అయితే లక్కీ తన మతిమరుపు వల్ల వచ్చే సమస్యలను తనకి అనుకూలంగా మలుచుకుంటూ నందన దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేస్తాడు. నందన వదిన(మధుమతి)ని ఓ సందర్భంలో కాపాడడంతో నందన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అప్పుడే నందన, పాండు రంగారావు కుమార్తె అని తెలుస్తుంది. అప్పటి నుండి అసలు కథ ప్రారంభమవుతుంది. తన ప్రేమను కాపాడుకోవడానికి పాండు రంగారావు దగ్గర నాటకం మొదలు పెడతాడు. అందులో భాగంగా తన స్నేహితుడు(వెన్నెల కిషోర్)ను లక్కీ పరిచయం చేస్తాడు. కానీ నందన ఇష్టపడే పాండు రంగారావు స్నేహితుడి కొడుకు అజయ్(అజయ్)కి ఎలాగైనా నందనకి లక్కీతో ఉన్న రిలేషన్ ని చెడగొట్టి తనవైపు తిప్పుకోవాలనుకుంటుంటాడు. మరి అప్పుడు లక్కీ ఏం చేస్తాడు? అజయ్ కి ఎలా బుద్ధి చెబుతాడు? పాండు రంగారావు మనసు మారుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష
నాని లక్కీ అనే మతిమరుపు యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. కామెడిని అద్భుతంగా పండించాడు. ప్రత్యేకంగా తన నటన గురించి చెప్పుకోవడానికి కారణం తను ఇప్పటి వరకు ఎన్నో కామెడి రోల్స్ లోనటించినా ఈ చిత్రంలో నాని ఫెర్ ఫార్మెన్స్ సూపర్. ముఖ్యంగా ప్రీ క్లయిమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ లో నాని నటన ఎక్సలెంట్. అలాగే లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చితే అందాల రాక్షసి తర్వాత తను మంచి స్కోప్ ఉన్న రోల్ లో నటించింది. తనకి మంచి బ్రేక్ ఇచ్చే మూవీగా భలే భలే మగాడివోయ్ నిలిచిపోతుంది. గ్లామర్ గా కనపడుతూనే, మంచి నటనను ప్రదర్శించింది. ఇక మురళీశర్మ చేసిన పాండు రంగారావు పాత్రలో జీవించాడనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత మురళీ శర్మ ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. ఎప్పుడూ సీరియస్ గా కనపడే మురళీ శర్మ ఈ సినిమాలో మంచి కామెడిని పండించాడు. అలాగే క్లయిమాక్స్ లో అజయ్ తో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది. దర్శకుడు మారుతి గురించే ప్రేమకథాచిత్రమ్ తర్వాత మారుతి చేసిన డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు సినిమాని ఫన్ యాంగిల్ లోనే చూపించాడు. ప్రతి సీన్ ని ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా డైరెక్ట్ చేశాడు. సినిమాలో చిన్న చిన్న లాజిక్స్ మిస్ కావడం మినహా సినిమాని లాంగింగ్ లేకుండా స్పీడ్ గా నడిపించాడు. గోపి సుందర్ మ్యూజిక్ రియల్లీ ఎక్సలెంట్. పాటలకు మొట్ట మొదటిసారి.. అంటూ హీరోయిన్ చూసి హీరో పాడే సాంగ్, తనకి లోపం ఇచ్చాడని దేవుడిపై కోపంతో పాడే హౌ హౌ సాంగ్ తో పాటు టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లాసికట్ తరహాలో ఎమోషనల్ గా గోపిసుందర్ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి, నాని, మురళీశర్మ, నరేష్, వెన్నెలకిషోర్ లు కామెడిని పండించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఏదైనా విషయాన్ని మరచిపోయిన నాని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం, మురళీశర్మ లక్కీ ఇంటికి వచ్చినప్పుడు వచ్చే కామెడిట్రాక్, వెన్నెలకిషోర్, మురళీశర్మ, నానిల మధ్య వచ్చే ఫన్ సీన్స్ ఆడియెన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తాయి. సినిమా మొత్తం కూల్ ఉంటుంది. అలాగే చివర్లో వచ్చే ఎమోషనల్ ట్రాక్ కూడా ఆడియెన్స్ ఆకట్టుకుంటుంది. ఇంత పెద్ద లోపం పెట్టుకుని ఎలా సంతోషంగా ఉన్నావని మురళీశర్మ నాని అడిగే సన్నివేశంలో మనసుకి నచ్చిన ఒక పని, ప్రేమించే ఒక మనిషి ఉంటే చాలు సార్ అని చెప్పే డైలాగ్, ప్రీ క్లయిమాక్స్ లో నాని సితారతో నాకు మతిమరుపు ఉందేమో కానీ నేను మోసగాడ్ని మాత్రం కాదమ్మా అంటూ చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకుల హృదయానికి హత్తుకుంటుంది. అలాగే కామెడి డైలాగ్స్ ప్రేక్షకుల అదరాలపై చిరునవ్వుని చివరి వరకు క్యారీ చేసేలా ఉన్నాయి. ఉద్ధవ్ ఎడిటింగ్ బావుంది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ప్రతి సన్నివేశాన్ని ఫ్రెష్ గా చూపించాడు.
విశ్లేషణ
నాని, మారుతి కాంబినేషన్ లో మూవీ అనగానే కచ్చితంగా కొత్తదనం ఉంటుందనుకునే ప్రేక్షకుడికి కొత్తదనం కనపడకపోయినా ఎంటర్ టైన్మెంట్ విషయంలో మాత్రం ఎంజాయ్ చేస్తాడు. ప్రేమను గెలిపించుకోవాలంటే కావాల్సింది మంచి మనసుంటే చాలని సింపుల్ లైన్ ని మారుతి ఎంటర్ టైనింగ్ తెరకెక్కించాడు. దానికి నాని పెర్ ఫార్మెన్స్ జతకావడంతో సినిమాలో ఎంటర్ టైనింగ్ కి తిరుగులేకుండా పోయింది. కథలో కొత్తదనం కనపడకపోయినా సినిమాని మారుతి నడిపించిన తీరు అద్భుతం. సాధారణంగా మతిమరుపుతో బాధపడే హీరో క్లయిమాక్స్ ఫైట్ లో మాత్రం ఏం మరచిపోకపోవడం, హీరోయిన్ వదినని హాస్పిటల్ చేర్చే సందర్భంలో అటు ఇటు కారుని తిప్పుతాడు కానీ అంబులెన్స్ కి ఫోన్ చేయ్యెచ్చు, లేదా మరేవరి సహాయానైనా తీసుకోవచ్చుననే లాజిక్ మిస్ అయినట్టు కనపడుతుంది. ఇలాంటి చిన్న లాజిక్స్ మిస్ కావడం మినహా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. మారుతికి గోపిసుందర్ మ్యూజిక్ రూపంలో, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ రూపంలో సపోర్ట్ లభించింది.
బాటమ్ లైన్: మారుతి టేకింగ్ కి నాని యాక్టింగ్ మిక్స్ కావడంతో భలే భలే మగాడివోయ్`..భల్లే భల్లే అంటూ ఎంటర్ టైన్ చేస్తుంది.
రేటింగ్: 3.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments