పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ ప్రమాణ స్వీకారం.. పసుపు వర్ణమైన ఖట్కర్ కలన్

  • IndiaGlitz, [Wednesday,March 16 2022]

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్‌ మన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌ కలన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌.. భగవంత్ మన్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్‌ ప్రజలంతా బాసంతి (పసుపు రంగు) తలపాగాలు ధరించి భగవంత్ మన్‌ను ఆహ్వానించారు. దీంతో ఖట్కర్‌ కలన్‌ గ్రామం పసుపు వర్ణమైంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా పసుపు రంగు తలపాగా ధరించి కన్పించడం విశేషం.

ఇకపోతే.. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీలో 92 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించింది. సంగ్రూర్‌ జిల్లా ధురి నుంచి పోటీ చేసిన భగవంత్‌ మాన్‌ 58 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆప్ ప్రభంజనంలో రాజకీయ దిగ్గజాలైన కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌లు కొట్టుకుపోయాయి. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలు సైతం ఓటమి పాలయ్యారు. ఇక ఓటమి అనంతరం ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో త్వరలోనే నూతన స్టేట్ కమిటీలను నియమించే అవకాశం వుంది.

More News