అమెజాన్ అనో.. ఫ్లిప్‌కార్ట్ అనో క్లిక్ చేశారో.. అంతే సంగతులు..
- IndiaGlitz, [Wednesday,December 16 2020]
మీ మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. పండుగ సందర్భంగా బ్రాండెడ్ వస్తులపై ఫ్లాట్ 45-60 పర్సెంట్ డిస్కౌంట్ అని.. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్‌కు బాగా అలవాటు పడిపోయిన జీవితాలు మనవి.. అది చూసి బ్రాండెడ్ వస్తువులు ఓ రేంజ్‌లో డిస్కౌంట్ అనో.. అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్ వంటి బడా ఆన్‌లైన్ సంస్థ ఆఫర్ అందిస్తుందనో క్లిక్ చేశారో.. అంతే సంగతులు.. మన సేవింగ్స్ ఖాతా కాస్తా జీరో అయిపోవడం ఖాయం..
పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా దోచేస్తున్నారు. ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి నిలువునా దోచేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువుల పేర్లు చెప్పి జనాల్లో ఆసక్తిని పెంచుతున్నారు. పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించి ముంచేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులు 45-60 శాతం డిస్కౌంట్.. పండుగ ఆఫర్.. అంటూ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు బల్క్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. బ్రాండెడ్ పేరు వినగానే కస్టమర్లు ముందూ వెనుకా ఆలోచించకుండా క్లిక్ చేస్తున్నారు. అంతే స్మార్ట్ ఫోన్‌లో డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది. ఆ ఫోన్‌లో ఉన్న యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ యూసర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల ఆధారంగా ఖాతాలోని డబ్బులను ఖాళీ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు: డీసీపీ క్రైమ్స్
దీనిపై సైబరాబాద్.. డీసీపీ క్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని స్పందించారు. సోషల్ మీడియా ప్రకటనలు నమ్మవద్దన్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లలో పండుగ ఆఫర్లు, తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు అంటూ.. ప్రకటనలు ఇస్తుంటారని.. వాటిని చూసి మోసపోవద్దన్నారు. పొరపాటున అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేసినా.. షాపింగ్ చేసినా.. కచ్చితంగా ఏదో ఒక రకమైన మోసానికి గురవడం ఖాయమన్నారు. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టిస్తున్నారన్నారు. వాటితోనే వినియోగదారులను మోసగిస్తున్నారన్నారు. వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.